calender_icon.png 22 December, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ దారెటు!

21-12-2025 12:00:00 AM

భారత వ్యతిరేక ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ ఇంక్విలాబ్ మంచా కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణ వార్త బంగ్లాదేశ్‌ను అగ్నిగుండంలా మార్చేసింది. ఈ నెల 12న ఎన్నికల ప్రచారం ముగించుకొని ఆటోలో వెళ్తున్న హాదీపై దుండగులు కాల్పులు జరిపారు. చికిత్స నిమిత్తం హాదీని సింగపూర్ తరలించగా, గురువారం పరిస్థితి విషమించి హాదీ మృతి చెందాడు. హాదీ మరణం బంగ్లాదేశ్ మొత్తం దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకాలో నిరసనకారులు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం(మ్యూజియం)తో పాటు, అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బెంగాలీ పత్రిక ప్రాథోమ్ అలో, కవ్రాన్ బజార్‌లోని డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయాలను టార్గెట్ చేసిన నిరసనకారులు వాటికి నిప్పుపెట్టారు. ‘ఇంక్విలాబ్ మంచా’కు చెందిన ఒక వ్యక్తి మరణిస్తే బంగ్లాదేశ్ అట్టుడికిపోవడం చూస్తుంటే ఆ దేశంలో ప్రభుత్వం కంటే ఒక ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె నుంచి దిగడానికి ప్రధాన కారణం హాదీనే అన్న సంగతి తెలిసిందే. హాదీ మొదటి నుంచి అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే వచ్చాడు.

హసీనా దేశం విడిచివెళ్లినప్పటికీ, ఆమె పార్టీ మళ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేకుండా అవామీ లీగ్ రద్దుకోసం ఇంక్విలాబ్ మంచా సంస్థ పట్టుబట్టి అనుకున్నది సాధించింది. భారత్‌ను తీవ్రంగా వ్యతిరేకించే హాదీ ఇటీవల గ్రేటర్ బంగ్లా పేరిట భారత ఈశాన్య రాష్ట్రాలను, బెంగాల్‌ను కలిపి మ్యాప్ రూపొందించడం గమనార్హం. హాదీ మరణవార్త ఒక ప్రైవేటు యూట్యూబ్ చానెల్ ద్వారా బయటికి రావడంతో బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ ఇస్లామిక్ శక్తులు చెలరేగిపోయాయి. యాంటీ ఇండియా లక్ష్యంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలకు దిగేలా చేశారు. దేశంలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలతో పాటు సెక్యులర్ భావజాలం కలిగిన డెయిలీ స్టార్ పత్రిక, బెంగాలీ పత్రిక ప్రాథోమ్ అలో కార్యాలయాల విధ్వంసానికి తెగబడ్డారు. దేశంలో జరుగుతున్న ఆందోళనలను, హిందువును కాల్చి చంపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

కానీ హాదీ హత్యకు కారణమైన వారిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే అతిపెద్ద ఉద్యమం చేపడతామని ర్యాడికల్ సంస్థ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. నిజానికి యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు పెరిగిపోయాయి. హిందూ దేవాలయాలపై దాడులు, దేవతావిగ్రహాలు ధ్వంసం, హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ హాదీ హత్య బంగ్లాను మరోసారి అట్టుడికేలా చేసింది. ఉదిక్త పరిస్థితులు నెలకొన్న వేళ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.