calender_icon.png 22 December, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణిత జ్ఞాన దిక్సూచి!

21-12-2025 12:00:00 AM

డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జయంతి

గణితంలో దేశంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యుల తర్వాత అంతటి మే ధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22న రామానుజన్ జన్మించారు. పుట్టుకతోనే కళాకారులు, గాయకులైన వారు ఉంటారు. కానీ శ్రీనివాస రామానుజన్ పుట్టుకతోనే గణిత శాస్త్రవేత్త. బతికింది 32 ఏండ్లు మాత్రమే అయినప్పటికీ గణితంలో ఆయన వయసుకు మించి ప్రతిభను చూపించి గొప్ప మేధావిగా గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరిచి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.

అయితే, జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది.అందులోని ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6,165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. కానీ, వారు అవగాహన చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించారు.  రామానుజన్ 1729 సంఖ్య గురించి గమ్మత్తున విశ్లేషణ చేశారు. 1729 అనే సంఖ్యను ‘టాక్సీ క్యాబ్’ సంఖ్యగాను, ‘రామానుజన్- హార్డీ’ సంఖ్యగాను  పిలుస్తారు. 1729ను రెండు ఘనాల మొ త్తంగా రెండు రకాలుగా రాయగల అతి చిన్న సహజ సంఖ్యగా రామానుజన్ విశదీకరించిన తీరు హార్డీని సైతం సంభ్రమా శ్చర్యాలకు గురి చేయడం గమనార్హం. ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి.

రా మానుజన్ ‘సమున్నత సంయుక్త సంఖ్య’ అనే భావనను ప్రవేశపెట్టారు. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకున్న జ్ఞానం మరొకరికి లేదు. సంఖ్యా సిద్ధాంతానికి రామానుజన్ సేవ అమోఘమైనది. ఆయన తనను తాను ఒక గణిత శాస్త్రవేత్తగా నిర్మించుకున్నారు. మేథమెటికల్ ఎనాలిసిస్, నంబర్ థియరీ, ఇన్ఫినిటీ థియరీలతో పాటు కంటిన్యూడ్ ఫ్రాక్షన్‌కు పరిష్కారాలు కష్టసాధ్యమనుకున్న సమయం లో రామానుజన్ సంఖ్యా సిద్ధాంతాల్లో పరిష్కారాలు దొరకడం విశేషం. వందేళ్ల క్రితమే గణితంలో రామానుజన్ ఆలోచించిన విధానాన్ని ఇప్పుడు అభ్యాసం చేస్తున్నట్లు ప్రపంచ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజుల్లోనూ రామానుజన్ మాక్-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 1916లో రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్ థియరమ్స్ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేర తపాళ బిళ్లను విడుదల చేసింది. ఆయన పుట్టిన రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ గణిత దినోత్సవముగా’ నిర్వహిస్తూ వ స్తోంది.  రామానుజన్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ‘ది మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ’ అనే చిత్రం ఆయన ప్రతిభా పాటవాలను కళ్లకు కట్టినట్లుగా చూపింది. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు ‘ఫెలో ఆఫ్ రా యల్ సొసైటి’ బిరుదు రామానుజన్‌ను వరించింది. మొత్తంగా గణిత జ్ఞానానికి దిక్సూచిగా నిలిచారు శ్రీనివాస రామానుజన్.

 సుంకవల్లి సత్తిరాజు