calender_icon.png 22 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిథి అధ్యాపకుల అరిగోస

22-09-2025 12:00:00 AM

-9 నెలలుగా అందని వేతనాలు

-పెండింగ్ వేతనాల కోసం నిరీక్షణ

హన్మకొండ, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలు అన్నీ ఇన్ని కావు. ప్రజా ప్రభుత్వం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని, మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నెలకు 42 వేల రూపాయలు వేతనం చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశపడ్డ అతిధి అధ్యాపకులకు నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో వేసిన జెల్ నోటిఫికేషన్ అతిథులకు యమపాశంగా మారింది. గడిచిన విద్యా సంవత్స రంలో ఎవరైతే పనిచేశారో వారిని అలాగే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ పలుమార్లు చెప్పినప్పటికీ ఆమోదయోగ్యం కాలేదని అతిధి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,654 మంది పనిచేస్తే, ఈ విద్యా సంవత్సరానికి 398 మందికి మాత్రమే అనుమతి ఇచ్చి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంపై మిగిలిన అతిథి అధ్యాపకుల పరిస్థితి అయోమయంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు తమకు సంబంధించి గడిచిన విద్యా సంవత్సరం, ఈ విద్యా సంవత్సరానికి గాను సుమారు 6 నెలల వేతనం, గత తొమ్మిది నెలల నుండి రాకపోవడంపై కుటుంబ పోషణ భారమై, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పెండింగ్ వేతనాలను మంజూరు చేయాలని, అదేవిధంగా కొత్తగా మంజూరు చేయ బడిన కళాశాలలను కలుపుకొని ప్రస్తుతం సుమారుగా 730 మంది పనిచేస్తున్నారు. 

ప్రిన్సిపాల్, జేఎల్ నుంచి డీ ఎల్ ప్రమోషన్, రిటైర్డ్ అయిన వారి స్థానంలో అదనంగా సుమారుగా 1,200 మందికి ఈ విద్యా సంవత్సరం అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఆర్థిక శాఖ ఆమోదం లేక, చాలామంది అతిధి అధ్యాపకులు రోడ్డు మీద పడే అవకాశం ఏర్పడిం దని వాపోతున్నారు. గత 12 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ తమ సర్వీసును పరిగణలోకి తీసుకోకుండా, తమను నిర్లక్ష్యం చేయడం తగదని సీనియర్ అతిథి అధ్యాపకులు వాపోతున్నారు.

ఇప్పటికైనా ప్రభు త్వం, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ స్పందిం చి గతంలో పనిచేసిన వారి సీనియార్టీ లిస్టు ఆధారంగా అడ్జస్ట్ చేయాలని పలువురు అతిథి అధ్యాపకులు కోరుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా అన్ని శాఖల మంత్రులను, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నామని, మంత్రుల అండదండలు ఉన్నా ప్రభుత్వంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమను కొనసాగించే ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఆవేదన వెల్లబుచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,654 మంది అతిథి అధ్యాపకులు చాలీ చాలని వేతనాలతో పేద మధ్య తరగతి విద్యార్ధుల కు విద్యా బోధన చేస్తున్నామని, కళాశాలలు ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు వేతనాలు విడుదల చేయలేదని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కూడా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకూ జీతాలు లేక అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో లో పొందుపరిచిన విధంగా నెల కు 42 వేల రూపాయల వేతనం సంవత్సరం మొత్తం  ఇచ్చే విధంగా అమలు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని  ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అతిథి అధ్యాపకులు సుమారుగా 12 సంవత్సరాలుగా  పనిచేస్తున్నామని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల కు ఉద్యోగ భద్రత కల్పించాలని  కోరుతున్నారు.        

పెండింగ్ వేతనాలు చెల్లించాలి

అతిధి అధ్యాపకులుగా గతంలో పనిచేసిన 1,654 మందిని యధావిధిగా కొనసాగించి, ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గత తొమ్మిది నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారమై అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. జీవనం దినదిన గండంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.

-దామెర ప్రభాకర్, అతిధి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు