calender_icon.png 12 October, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మ దహనం

11-10-2025 02:00:09 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు నిరసనగా బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుమీదికొచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మను శుక్రవారం నాడు ప్రిన్స్  చౌరస్తాలో దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా పోలీసులకు బీసీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. జనాభాలో మేమెంతో మా వాటా అంత అంటూ నినాదాలు చేశారు. ఇంకెన్నాళ్లు బీసీలను అనగ తొక్కుతారు. ఈ దేశంలో బీసీలను బతకనివ్వరా అంటూ ఆ వేదన వ్యక్తం చేశారు.

బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లను అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో శాసనసభలో చట్టం చేసి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా కొందరు రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు అడ్డుకునే దురుద్దేశంతో హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం  శోచనీయమన్నారు.

తమకు న్యాయం జరిగేంతవరకు ఉద్యమిస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్ ,  గాజుల క్రాంతి కుమార్, తురకపల్లి మండల అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్, వడిచర్ల కృష్ణ యాదవ్, నాయకుడు  పిట్టల బాలరాజ్ ముదిరాజ్,   సిరికొండ శివకుమార్ రజక, రత్న రాజు వంజరి, రామకృష్ణ యాదవ్,తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.