19-10-2025 12:00:00 AM
42 శాతం కోటా ఇవ్వాల్సిందే
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు
డిపోలకే బస్సులను పరిమితం చేసిన నాయకులు
రాష్ట్రంలో స్తంభించిన ప్రజా రవాణా
విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 18: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలో నిర్వహించిన బంద్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిందేనని బీసీ నాయకులు, పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. జనాభాలో తమ శాతం ఎంతో రిజర్వేషన్లలో కూడా అంతే వాటా ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ బంద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు బస్సులను డిపోలకే పరిమితం చేయడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. బస్టాండులన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా దొరక్కపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ బందు ప్రశాంతంగా ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలతోపాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయలుదేరకుండా తెల్లవారుజామునే వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు గేటు వద్ద బైఠాయించడంతో బస్సులు కదల్లేదు. బస్టాండ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రైవేటు వాహనాలను కూడా చాలాచోట్ల అడ్డుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. వరంగల్ 1వ డిపో వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి మాజీ స్పీకర్ మధుసూదనాచారి బైఠాయించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను మభ్యపెడుతోందని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ పట్టణ కేంద్రంలో బీసీ బంద్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ బైక్ ర్యాలీ నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. భువనగిరి పట్టణం ప్రిన్స్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో విప్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ.. అందరి సహకారంతో బీసీలు రిజర్వేషన్లు సాధించేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్‌గౌడ్, ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి పాల్గొన్నారు. వలిగొండలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో బంద్‌లో బంద్ విజయవంతమైంది.
రిజర్వేషన్ల అమలుకు పట్టుబడి ఉన్నాం: మంత్రి అడ్లూరి
పార్టీలకు, సంఘాలకు అతీతంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బంద్‌లో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. విప్ అది శ్రీనివాస్ వేములవాడలో బంద్‌లో పాల్గొన్నారు. గోదావరిఖని, రామగుండంలో జరిగిన బంద్‌లో ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో..
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ దీక్షలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో కాంగ్రెస్ నేత నీలం మధు నేతృత్వంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సంగారెడ్డి బస్ డిపో వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. రామాయంపేటలో నిర్వహించిన బంద్‌లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు తెల్లవారుజామున మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. చట్టాలను రూపొందించే అధికార పార్టీలా నేతలే బందులో పాల్గొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వ్యాపార సముదాల ముందు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో పాటు పలువురు తమ నిరసనను కొనసాగించారు.
నాగర్‌కర్నూల్ అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ కల్పించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రం కక్ష సాధింపు: మంత్రి జూపల్లి
బీసీ బిల్లును గవర్నర్‌కు పంపితే ఆమోదం తెలుపకుండా అడ్డుకున్నది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం సబ్బండవర్ణాలు చేసిన ఉద్యమం లాగానే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగాలని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రంలో నిర్వహించిన బంద్‌లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లాలో..
బీసీ బందు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇష్టం లేదని బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారామ్ యాదవ్ ఆరోపించారు. బీసీ ప్రధానినని చెప్పుకుంటున్న మోడీ బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగ సవరణకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాదు ఉప్పల్ డిపో ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మేడ్చల్ పట్టణంలో బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు డిపో ముందు బైఠాయించారు. ఉప్పల్‌లో సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నేరేడ్‌మెట్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి బందుకు మద్దతు ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సంపూర్ణంగా కొనసాగింది. బీసీ సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. బీసీల పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కపట ప్రేమ చూపుతున్నాయాని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ శ్రేణులతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట తెల్లవారుజామునే బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్‌లో కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పాల్గొన్నారు.
భద్రాద్రి, కామారెడ్డి జిల్లాల్లో
భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఆందోళనలో పాల్గొన్నారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ములకలపల్లిలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో బందు ప్రశాంతంగా కొనసాగింది.