16-10-2025 07:21:57 PM
కరీంనగర్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధనకు వివిధ బీసీ సంఘాలతో ఏర్పడిన ‘బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ’-(బీసీ జేఏసీ) ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, బంద్ లో ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటామని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహాయ, కార్యదర్శి బావండ్లపల్లి యుగేంధర్ తెలిపారు. ఈ సందర్భంగ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బీసీ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద నిన్న హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించినా గవర్నర్ ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు. బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదివ షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితిలోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీని భూస్థాపితం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచాల మురళి మాడి శెట్టి అరవింద్ శ్రవణ్ రాజ్ సమన్ మనోహర్ కసిరెడ్డి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.