28-09-2025 01:27:12 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల అంశంలో చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసు కోవాలని పేర్కొంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం శనివారం విచారించింది.
రిజర్వేషన్ల జీవోను కొట్టివేయాలని మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కి చెందిన మాధవరెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్ జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టిం ది. చట్ట ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లను 27శాతం నుంచి 42శాతానికి పెంచారని, మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60శాతం దాటిందని రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉందని పిటిషనర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల జీవోను గెజిట్ చేశారా? అని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇవ్వలేదు.
దాంతో గెజిట్ చేయకముందే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని కోర్టు ప్రశ్నించింది. బీసీల రిజర్వేషన్ల జీవో గెజిట్ కాకపోవచ్చని హైకోర్టుకు తెలిపిన ఏజీ సుదర్శన్‌రెడ్డి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మాత్రమే ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. నూతన జీవో వల్ల రిజర్వేషన్ పరిమితి 67 శాతానికి చేరిందని.. బీసీ రిజర్వేషన్లు 35శాతం పెంచుతూ 2018లో జీవో ఇచ్చారన్నారు.
2018లో ఇచ్చిన జీవోను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసిందని తెలపగా.. తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతానికి పెంచారు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రిజ ర్వేషన్ పెంచారని చెప్పిన పిటిషన్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణలో ఉందని పిటిషనర్ తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని 285ఏ ని సవరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని.. అసెంబ్లీ తీర్మానం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.
గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మూడు నెలల కాల పరిమితి ఉందని, ఆగస్టు 31న గవర్నర్ పరిశీలనకు బిల్లు పంపి నెల రోజు లు కూడా కాకముందే ఎల జీవో జారీ చేస్తారని అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
స్థానిక ఎన్నికలపై అక్టోబర్ 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సమయం కోరారు. బీసీల రిజర్వేషన్లపై చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని ఈ మేరకు విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవద్దని హైకోర్టు సూచించింది. పది రోజుల పాటు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కూడా సూచించింది.
నవంబర్ వరకు ఆగండి
42శాతం పెంచుకోవాలనుకుంటే నవంబర్ వరకు ఆగాలని ధర్మాసనం సూచించింది. గవర్నర్ ఏమి చెప్పకుంటే ఆ బిల్లు పాస్ అయినట్టే కదా? అప్పటి వరకు ఆగాల్సిందేనని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రిట్ పిటిషన్లు అడ్మిషన్ కాదు.. అప్పుడెలా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ సందర్భంగా పది రోజుల వరకు ఎన్నికలు ఆపగలరా...? అని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.