28-09-2025 12:57:29 AM
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 27: ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం జోరు వాన కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో భారీ వరద ఉద్రిక్తతకు రహదారి కొట్టుకుపోయింది. సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్ మోమిన్ పేట్ వైపు రాకపోకలు నిలిచాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సైదాపూర్ శివారులోని రహదారి స్థానిక నాయకులతో కలసి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.
యుద్ధ ప్రాతిపదికన కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మతులు చెయ్యాలని కొండాపూర్ ఎమ్మార్వో అశోక్‌ను ఆదేశించారు. సైదాపూర్ గ్రామ శివారులోని రోడ్డు కొట్టుకు పోవడంతో చుట్టుపక్కల ఉన్న 40 ఎకరాల వరి, పత్తి పంటలు నష్టపోయాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శనివారం ఉదయం నుం డి ఆయా గ్రామాల్లో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నారాయణఖేడ్ నుండి కంగ్టి వెళ్లే మార్గంలో నారాయణఖేడ్ వద్ద బ్రిడ్జి పై నుంచి వరద పారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వంతెన దాటకుండా ప్రజలను అదుపు చేశారు. అలాగే పంటలు పూర్తిగా నీట మునిగాయి.
వనదుర్గమ్మ చెంత గంగమ్మ ఉగ్రరూపం
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ చెంత గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న సంగతి తెలిసిందే. సింగూరులో ఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతుండటంతో దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో పాటు ఎగువన భారీ వర్షాలు కురవడంతో మంజీరాలో నీటి ప్రవాహం ఉధృతంగా పెరిగింది. దీంతో వన దుర్గమ్మ ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
కరీంనగర్ జిల్లాలో
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ముసురు పట్టేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా వద లకుండా కురుస్తున్నది. అక్కడ క్కడా మాత్రం దంచికొడుతుండగా, లోత ట్టు ప్రాంతాలు జలమయమై, రోడ్లన్నీ అధ్వానంగా మారుతుండగా, ప్రజలు ముఖ్యంగా బతుకమ్మ ఆటకు ఆటంకం కలుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెరిపిలేని వానతో వాగుల్లో వరద వస్తుండగా, చెరువులు, కుంటలు సహా పలు ప్రాజెక్టులోకి నీరు చేరుతున్నది.
సిరిసిల్ల జిల్లాలోని ఎగువ, మధ్య మానేరుతోపాటు కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయాలకు ఇన్ ఫ్లో వస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మానేరు, మోయతుమ్మెద, చిలుక వాగుల్లో ప్రవాహం కొనసా గుతుంది. ఎల్‌ఎండి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.558 టీఎంసీల నీరు ఉంది.
ఇన్ ఫ్లో 10,212 క్యూసె క్కులు కాగా, అవుట్ ఫ్లో 9309 క్యూసెక్కులు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ నాలు గు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యమానేరులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. 27.55టీఎంసీల సామ ర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 27.171 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 5622 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 4049 క్యూసెక్కులు ఉంది.
వద్ద గోదావరి ఉగ్రరూపం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం నుంచి కొంచెం కొంచెం తగ్గుతున్నా తిరిగి ఆదివారం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటు న్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పరిస్థితి ఏర్పడిం దని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు రెండు లాంచీలను సిద్ధం చేసి అప్రమత్తంగా ఉన్నారు. శనివారం సాయం త్రం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉన్నది.
శుక్రవారం రాత్రి భద్రాచలం పట్టణంలో భారీ వర్షం పడటంతో నీరు గోదావరిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో దేవాలయ పరిసరాల్లోని పలు ప్రాంతాలు శనివారం ఉదయం జలమయమయ్యాయి. ముఖ్యంగా గోదావరి నీటిమట్టం పెరుగుతూ ఉండటంతో గోదావరి వరద నీరు భద్రాచలం పట్టణంలోకి స్లూయిస్ ద్వారా రాకుండా నిరో ధించడానికి కరకట్ట షట్టర్లు మూసివేశారు. పట్టణంలో పడిన వర్షంతో పలు దుకాణాలు, దేవస్థానం రోడ్డు, అన్నదాన సత్రం నీటమునిగాయి.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంటుండగా ప్రాజెక్ట్‌లోని 15 వరద గేట్ల ద్వారా ఒక లక్ష పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఈ ఈ సోలోమోన్ తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్ట్, పోచారం, హల్ది వాగు ద్వారా భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పది గేట్లు ఎత్తివేత
కృష్ణమ్మ మహా ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా జూరాల మీదుగా శ్రీశైలానికి భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. 4,75,890 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లను 20 ఫీట్ల మేర పైకి ఎత్తి 4,61,560 క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సాగర్ వైపు పరుగులు పెడుతుంది. 215 టీఎంసీల సామర్థ్యం 885 అడుగులు సామర్థ్యం గల శ్రీశైలం ప్రస్తుతం 22 .0439 టీఎంసీలు 882 అడుగుల వద్ద నీటి సామర్థ్యం కొనసాగుతోంది.