calender_icon.png 22 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సర్పంచ్‌ల గెలుపు.. రాజ్యాధికారానికి తొలిమెట్టు

22-12-2025 02:33:20 AM

పంచాయతీ ఎన్నికల్లో 51 శాతం బీసీల విజయభేరి

బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 21 (విజయక్రాంతి): ‘పంచాయతీ ఎన్నికల్లో 51 శాతం మంది బీసీలు సర్పంచ్‌లుగా గెలుపొందడం సామాన్య విషయం కాదు. ఇది బహుజన రాజ్యం ఏర్పడడానికి తొలిమెట్టు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి రాజ్యాధికారాన్ని సాధించుకుందాం’ అని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్.దుర్గయ్యగౌడ్ అధ్యక్షతన పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో రాజ్యాధికారం సాధిద్దాం అనే అంశంపై ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాల్‌రాజ్ గౌడ్ ప్రధాన రాజకీయ పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు.

బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక చెంపపెట్టు అని బాల్‌రాజ్ గౌడ్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను నమ్మించి మోసం చేసిందని, గతంలో ఉన్న 22 శాతం రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించి నట్టేట ముంచిందని మండిపడ్డారు. అయినప్పటికీ బీసీలు చైతన్యవంతులై జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి సగానికి పైగా విజయాలు సాధించడం శుభపరిణామమన్నా రు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం పటేళ్లు, దొరలకే రాజ్యాధికారం దక్కిందని, బీసీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఇక బీజేపీ కూడా బీసీలకు చేసిందేమీ లేదని, పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వకుండా అగ్రవర్ణాలకు కట్టబెట్టి తన నైజాన్ని బయటపెట్టుకుందని ఎద్దేవా చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు, ర్యాలీలు, ధర్నాల వల్లే సమాజంలో కదలిక వచ్చిందని నేతలు పేర్కొన్నారు. 

సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర

రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు సంక్రాంతి పండుగ తర్వాత రాష్ర్టవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బాల్ రాజ్ గౌడ్ ప్రకటించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమై విజయకేతనం ఎగురవేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫ్రంట్ రాష్ర్ట కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, విజయకుమార్‌గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్ గంగపుత్ర, నగేశ్ ముదిరాజ్, మల్లేష్ యాదవ్, సింగం నాగేష్ గౌడ్, దామోదర్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.