calender_icon.png 9 September, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏం సాధించారని బీసీల విజయోత్సవ సభ..

09-09-2025 04:38:49 PM

- బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది...

- బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ 

మంచిర్యాల, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని ఈ నెల 15న కామారెడ్డిలో బీసీల విజయోత్సవ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్(District President Naredla Srinivas) ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి కాలయాపన చేస్తుందని విమర్శించారు. కోర్టుల్లో నిలబడని జీవోలు ఇచ్చి, ఎవరైనా కోర్టుకు వెళితే ఉత్తర్వులు కొట్టి వేయడం ఖాయమని తెలిసి కూడా మరోసారి బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా విద్య, ఉద్యోగాల్లో కల్పించిన తర్వాతనే విజయోత్సవ సభ నిర్వహిస్తే బాగుంటుందని, కానీ బీసీలను మభ్య పెట్టేందుకు, మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి కొత్త డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్ ప్రకారం పార్లమెంట్లో చట్ట సవరణ చేయవలసి ఉంటుందనీ, కాంగ్రెస్ పార్టీ ఆ వైపుగా ప్రయత్నాలు చేయకుండా, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయకుండా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా రాష్ట్రంలో హడావుడి చేసి జీవోల పేరుతో, పంచాయతీరాజ్ చట్ట సవరణతో ముందుకు వెళ్తే జరిగేది శూన్యమని, బీసీలను మభ్య పెట్టేందుకు, మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అమలుకు యోగ్యం కానీ చర్యలు తీసుకుంటూ బీసీలకు ఏదో మేలు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఈ సమావేశంలో బీసీ సమాజ్ జిల్లా నాయకులు బొలీశెట్టి లక్ష్మణ్, ఎదునూరి రమేష్, మంచర్ల సదానందం, ఆకుతోట పద్మదేవి, బీసీ సమాజ్ సీనియర్ నాయకులు పెద్దపల్లి సూరయ్య, గందేశ్రీ తిరుపతి, గుమ్ముల సుదర్శన, కొండు రాజు, చెవుల సురేష్, బొట్ల లక్ష్మీనారాయణ, పెద్దపల్లి భీమయ్యలు పాల్గొన్నారు.