calender_icon.png 16 October, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండండి

16-10-2025 02:04:31 AM

-ధాన్యం సేకరణకు 8,342 కేంద్రాల ఏర్పాటు

-కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

-వానాకాలంలో 148.03 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి 

-కొనుగోలుకు 23వేల కోట్లు.. 48 గంటల్లో చెల్లింపులు

-జిల్లా కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాం తి):  ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సున్నితమైన అంశం..  కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలుగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని  రాష్ర్ట పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  దేశంలోనే ఏ రాష్ర్టంలో లేని విధంగా భారీ ఎత్తున ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

వానాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై బుధవారం సచివాలయం లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 148.03 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేశామని,  అందులో 23 కోట్లు వెచ్చించి 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

వానాకాలంలో  మొత్తం 66.8 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయిన ధాన్యం కొనుగోలుకు  రాష్ర్ట వ్యాప్తంగా 8,342  కేంద్రాలను ఏర్పా టు చేశామని, అందులో 4,259 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 3,517 ఐ కే పి కేంద్రాల ద్వారా,ఇతర సంస్థల ద్వారా మరో 566 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రాల వద్ద  మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు పూర్తి స్థాయి లో రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలని  ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం తాలూక వివరాలు నమోదు అయిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు ఉంటాయని తెలిపారు. 

ఇబ్బందులు తీర్చేందుకు హెల్ప్‌లైన్.. 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/ 1967 హెల్ఫ్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేయాలని,  కొనుగోలు ప్రక్రియ ముగిసే వరకు జిల్లా కేంద్రం నుంచి కొనుగోలు కేంద్రాల వరకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు  వివరించారు.  సమావేశంలో సీఎ స్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, రవాణాశాఖ కమిషనర్ రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. 

మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్

మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్  అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  స్పష్టం చేశారు. ఇప్పటికే కామా రెడ్డి, నిజమాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో 1,205 కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించినట్లు  వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా చర్యలు చేపట్టడంతో పాటు కొనుగోలుకు సంబంధించిన అన్ని పరికరాలు అమర్చుకోవాలన్నారు.  గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను విజయవంతం చేయాలని  కోరారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అత్యవసరం అనిపిస్తే అదనపు ఖర్చులకు వెనుకడుగు వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల వ్యవధిలో రైతులకు నగదు చెల్లింపులకు వీలుగా తూకం నుంచి డేటా ఎంట్రీ వరకు సమయపాలన పాటించాలన్నారు. వాతావరణ మార్పులు, వర్ష సూచనలను పౌర సరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం వస్తే ధాన్యం చెడిపోకుండా ఉండేందుకు గాను టార్బలిన్ లను ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో తనతో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ను సంప్రదించాలన్నారు. 24 గంటలు తాను అందుబాటులో ఉం టామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.