16-10-2025 02:07:21 AM
-ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ఉన్న.. రాజకీయ వైరంతోనే వెళ్లని కొండా దంపతులు
-మంత్రి ఓఎస్డీని తప్పించడంలో అంతర్యమేమిటి?
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : గత కొన్ని నెలలుగా వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కొండా సురేఖ, అదే జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేల మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లాయి. ఇటీవల మేడారం ఆల యం పునురుద్ధరణ పనులకు దేవాదాయ శాఖకు చెందిన రూ. 71 కోట్ల టెండర్ అంశం పై వరంగల్ పంచాయితీ మరింత రచ్చకెక్కింది.
అయితే, సంబంధిత శాఖకు చెందిన కొండా సురేఖకు తెలియకుండానే టెండర్లు పిలవడంపైన సొంత పార్టీతో పాటు రాజకీ య వర్గాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యా యి. బీసీ వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖకు సొంత శాఖలో ఎలాంటి సమాచా రం లేకుండా టెండర్లు పిలవడమేంటనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు ఆ వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ ఒక మాటలో చెప్పాలంటే ‘రెడ్డి వర్సెస్ బీసీ’ గా మారిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం వరంగల్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
సీఎం ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి స్మారక కార్యక్రమానికి సీఎం వెళ్లడం, ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులకు మొదటి నుంచి రాజకీ య వైరం ఉండటంతో .. ఆ కార్యక్రమానికి కొండా దంపతులు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ వెళ్లలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మేడారం పనుల సమీక్షకూ...
అయితే సమ్మక్క, సారక్క ఆలయ పనుల కు సంబంధించి మేడారంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క మూడు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షకు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొం డా సురేఖ దూరంగా ఉన్నారు. మేడారం ఆల య పనుల సమీక్షకు మంత్రి సురేఖను అధికారులు ఆహ్వానించినా వెళ్లలేదని చర్చ జరుగుతోంది.
అయితే తన సొంత శాఖలో ఇతర మంత్రులు జోక్యం చేసుకోవడమేం టీ..? నాకు తెలియకుండానే నా శాఖలో టెం డర్లు పిలవడమేంటీ..? నేను ఒక బీసీ బిడ్డను అయినందుకేనా..?అందులో మహిళను కావడంతోనేనా... ఈ వివక్షత అని మంత్రి కొం డా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా సహచర మంత్రి వివేక్ కూ డా కొండా సురేఖకు తెలియకుండానే ఫారె స్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించడం వివాదమైన విషయం తెలిసిందే. జిల్లాకు సంబంధించిన అంశాలపైనే ఫారెస్టు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించానని, సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహించ డం సమాచార లోపం జరిగిందని వివేక్ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.
రోజులుగా అజ్ఞాతంలో సుమంత్?
రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను తప్పించడం కూడా వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. కాలుష్య నియంత్ర బోర్డులో సుమంత్ ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతన్ని మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా నియమించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు, మేడారం ఆల యానికి సంబంధించి టెండర్ వివరాలు సేకరణలో సుమంత్ ఉన్నారనే సమాచారం లోనే మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే తప్పించారనే ప్రచారం జరుగుతోంది. కాలుష్య నియంత్రణ బోర్డు ఒప్పంద ఉద్యోగి సుమంత్‌ను విధుల నుంచి తొలగించింది. కాగా, వరంగల్ కాంగ్రెస్ పంచాయితీకి పార్టీ ముగింపు పలుకుతుందా..? లేదా తన్నుకుంటుంటే తమాషా చూస్తుందా..? అనే రాజకీ య వర్గాల్లో ఆసక్తిగా మారింది.
మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట హైడ్రామా
-ఓఎస్డీ సుమంత్ కోసం వచ్చిన వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
-పోలీసులతో మంత్రి కూతురు కొండా సుస్మిత వాగ్వాదం
రెండు రోజులుగా మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో వచ్చారు. దీంతో మంత్రి కూతురు కొండా సుస్మిత ‘మా ఇంటికి ఎందుకు వచ్చా రు’.. అంటూ ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సుమంత్ ఆచూకీ కోసం వచ్చామని పోలీసులు చెప్పారు. అయితే ‘ఏ అధారాలతో మీరు మా ఇంటికి వచ్చారు, కారణాలు చెప్పండి’ అని సుస్మిత ప్రశ్నించారు. దీనితో అర్ధరాత్రి మంత్రి ఇంటి ఎదుట హైడ్రామా చోటుచేసుకుంది.
సుమంత్.. మంత్రి ఇంట్లోనే తలదాచుకున్నట్లు తమకు సమా చారం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. కాగా, ఆ సమయంలో మంత్రి కొండా సురేఖ ఇంట్లో లేరని తెలిసింది. పలు ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ సుమంత్‌ను బాధ్య తల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుస్మిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే.. బీసీలమైనం దుకు తమను తొక్కెయ్యాలని కొందరు మంత్రులు కుట్ర పన్నుతున్నారన్నారు. సుమంత్‌ను అడ్డంపెట్టుకుని తన తండ్రి కొండా మురళిపై కేసులు బనాయించాలని చూస్తున్నట్లు అనుమానం కలుగుతుందని చెప్పారు. వెలమ రాజ్యంపోయి, రెడ్డి రాజ్యం వచ్చిందని ఆమె ఆరోపించారు.