16-10-2025 02:00:55 AM
-బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు స్పష్టీకరణ
-బీసీ జేఏసీ బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు
-బీజేపీ ఆఫీసులో బీసీ నేతల బాహాబాహీ
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు తెలిపారు. రాష్ర్టంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ బంద్ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొని మద్ద తు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
బీసీలకు న్యా యం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వా లని కోరుతూ బుధవారం రాజ్యసభ సభ్యు డు, బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ జేఏసీ నాయకులు బీజేపీ పార్టీకార్యాలయానికి వెళ్లి తమ బంద్‌కు మద్దతివ్వాలని రాంచందర్‌రావును కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీసీల న్యాయం కోసం ఆర్ కృష్ణ య్య చేసిన విజ్ఞప్తి మేరకు బీజేపీ ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. బీసీల న్యాయం కోసం బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో జేఏసీ చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ మద్దతిస్తోందన్నారు.
బీసీల హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని, బీసీ సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని అభినందిస్తున్నామన్నారు. బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయంచేయగలిగిన పార్టీ అని, కామారెడ్డి డిక్లరేషన్ చేసి హామీలు ఇచ్చిన కాంగ్రెస్, చేయలేని పనిని ఇప్పుడు ఇతరులపై మోపుతోందన్నారు. ప్రజలు, బీసీ సంఘాలు, ఓబీ సీ సమాజం ఈ విషయాన్ని గమనిస్తున్నారని చెప్పారు. బీసీలకు గౌరవం ఇచ్చిన పార్టీ బీజేపీ అని, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని, ఇది బీసీలకు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.
కులగణన బీసీల చరిత్రాత్మక విజయం..
1931 తర్వాత మొదటిసారిగా కులగణన చేపట్టేందుకు తీసుకున్న నిర్ణయం బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, బ్రిటిష్ కాలం నుంచి ఆగిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించి, బీసీల నిజమైన జనాభా ఆధారంగా విధానాలు రూపొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ ముందడుగు వేశారని తెలిపారు. ఇది బీసీ సమాజానికి చరిత్రాత్మక విజయమన్నారు.
కాంగ్రెస్ బీసీలకు ద్రోహం చేసిందని, బీసీల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు, బీసీల వాదనలు వినకపోవడం పట్ల సమాజం ఆగ్రహంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీ చూపిన నిర్లక్ష్యమే అని తెలిపారు. ఆర్ కృష్ణ య్య, ఇతర కుల సంఘాలు రిజర్వేషన్ల పిటిషన్‌లలో ఇంప్లీడ్ అయినా, వాటిని పట్టిం చుకోలేదని, ఈ ద్రోహ ధోరణే బీసీ సమా జం కాంగ్రెస్‌పై తిరగబడేలా చేసిందన్నారు.