10-05-2025 03:15:04 AM
న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్ - భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశించారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్‌ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్‌ఎఫ్, హోంశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద భద్రత మరింత పెంచాలని ఆదేశించారు.
సరిహద్దుల్లో చొరబాట్లను ఉపేక్షించొద్దని, ఎప్పటికప్పుడు వాటిని అడ్డుకోవాలని సూచించారు. ఇప్పటికే పంజాబ్ సరిహద్దు వద్ద చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని భారత సైన్యం మట్టుపెట్టిందని గుర్తుచేశారు. సరిహద్దుల వద్ద అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ‘షూట్ అండ్ సైట్’ ఆర్డర్స్ అమలులో ఉంటాయని తేల్చిచెప్పారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను మరింత పటిష్టపరచాలని సూచించారు. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాలన్నారు. రాజస్థాన్ పరిధిలో వెయ్యి కిలోమీటర్లకుపైగా సరిహద్దును మూసివేశామని తెలిపారు.