calender_icon.png 15 July, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ నిరంజన్ రెడ్డి

14-07-2025 10:14:28 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి(Circle Inspector Niranjan Reddy) తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై ఆయన ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే, బెట్టింగ్ యాప్‌లను, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఏపీకే లింకులను క్లిక్ చేయవద్దని యువతకు సూచించారు.

ఇటీవల కొంతమంది సైబర్ నేరగాళ్లు పిఎం కిసాన్, ఎస్ బి ఐ రివార్డుల పేరుతో లింకులను పంపుతున్నారని, వాటిని పొరపాటున క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి లింకుల ద్వారా మీ బ్యాంక్, వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. అటువంటి లింకులు వచ్చినప్పుడు వాటిని వెంటనే తొలగించాలని, తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని అన్నారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఇటువంటి వివరాలను కోరవని స్పష్టం చేశారు. ఒకవేళ మీరు మోసపోయినట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.