08-09-2025 01:10:43 AM
టోక్యో, సెప్టెంబర్ 7: జపాన్ ప్రధాని షిగేరు ఇషీబా ప్రధాని పదవికి ఆదివారం రాజీనామా చేశారు. గత కొద్ది రోజుల నుంచి సొంత పార్టీ నేతలతో ఆయనకు అంతర్గత విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఇషీబా రాజీనామా నిర్ణయం ప్రకటించారని అంతా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఇషీబా రాజీనామా ప్రకటన వెలువడింది.
అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన ఇషీబా అక్టోబర్‌లోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ సాధించలేకపోయింది. అంతే కాకుండా దిగువ సభలో కూడా మెజారిటీ కోల్పోయింది. ఈ పరిణామాలన్నీ ప్రధానిపై ఒత్తిడిని పెంచాయి. ప్రత్యామ్నాయ నేతను ఇంకా ఎన్నుకోలేదు.