31-08-2025 12:07:09 AM
కొచ్చి, ఆగస్టు 30: కొచ్చిలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్ వినూత్న నిబంధన విధించాడు. బ్యాంక్ క్యాంటీన్‌లో ఉద్యోగులెవరూ బీఫ్ తొనొద్దని ఆదేశాలిచ్చాడు. దీంతో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఇలా నిషేధం విధించిన బ్యాంకు మేనేజర్‌ది బీహార్‌గా తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు బ్యాంకు బయటే బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. వీరి నిరసనకు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ప్రతి పౌరుడికి రాజ్యాంగం నచ్చిన ఆహారం తినే హక్కును కల్పించిందని.. ఈ హక్కును ఎవరూ ఉల్లంఘించలేరని ఉద్యోగులు పేర్కొన్నారు. బ్యాంకులో చిన్న క్యాంటీన్ ఉండగా.. అందులో కొన్ని రోజుల్లోనే బీఫ్ వడ్డిస్తున్నారని, ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఆదేశాలతో అది కూడా మానేశారని ఉద్యోగులు ఆరోపించారు.