14-11-2025 12:55:11 AM
కలెక్టర్ కుమార్ దీపక్
హజిపూర్, నవంబర్ 13 : వైద్య కళాశాల లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదివి సమాజానికి విలువలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని గుడిపేటలో గల ప్రభుత్వ వైద్య కళా శాలలో 2025 సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సులేమాన్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఏకాగ్రతతో చదివి సమాజానికి మంచి వైద్య నైపుణ్యం, విలువలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, వసతి గృహం లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని, డిసెంబర్ 31 నాటికి గుడిపేటలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా కేంద్రంలో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జిల్లాలోని లక్షెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాలలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు దాదాపు 500 మంది ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అనిత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేద వ్యాస, సంబంధిత అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.