12-05-2025 03:00:58 AM
జగిత్యాల, మే 11 (విజయక్రాంతి): పలు రకాల ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాలో మంత్రి పర్యటించారు. మొదట జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో గల సుప్రసిద్ధ ప్రాచీనాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు.
ఆలయంలో లక్ష్మి నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, మహా ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వైద్య సేవల బలోపేతంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవలు విస్తృత పరచాలన్నారు. ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు విశ్వసనీయత, నమ్మకం కలిగేలా ప్రవర్తించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగు పరిచేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలపై, రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ వైద్య విధాన పరిషత్, డీఎంఈ పరిధిలో గల ఆస్పత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా చర్చించారు.
ఈ కార్యక్రమాల్లో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమోద్, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఖాద్రి, జిజిహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.