18-01-2026 01:26:31 AM
దేశవ్యాప్తంగా 7 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ‘క్రిటికల్’ పరిస్థితులు.. అందులో భద్రాద్రి
సాధారణ నిల్వలో 15 శాతం బొగ్గు మాత్రమే ఉంది
రోజూ 16.8 వేల టన్నులకు 13 నుంచి 14 వేల టన్నులే సరఫరా
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత విషయం ఏమోగానీ.. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఉన్నప్పటికీ.. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేం ద్రంలో మాత్రం బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. దేశ వ్యాప్తంగా (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం 7 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోకపోవడంతో.. పరిస్థితి విష మం (క్రిటికల్) గా ఉందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ పవర్ పోర్టల్ గణాంకాలతో సహా వెల్లడించింది.
శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉన్న బొగ్గు నిల్వలను వెల్లడించిన నేషనల్ పవర్ పోర్టల్ గణాంకాలు.. భద్రాద్రితోపాటు మొత్తం 7 థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు ‘క్రిటికల్’ పరిస్థితిలోకి మారాయని స్పష్టం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా అవుతుంది. దేశీయ బొగ్గు (సింగరేణి) దీనిని సరఫరా చేస్తోంది. అయితే వాస్తవానికి ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలోనూ సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ (సీఈఏ) సూచనల ప్రకారం కనీసం 24 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి. కానీ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మాత్రం కేవలం 4 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలే అందుబాటులో ఉండటంతో ఈ థర్మల్ ప్లాంట్‌ను క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్టుగా పరిగణించారు.
4.3 లక్షల టన్నులకు..
కేవలం 60.8 వేల టన్నులే..
సీఈఏ మార్గదర్శకాల ప్రకారం ప్రతి థర్మల్ ప్లాంట్‌ను 85 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో నడిపినా.. 24 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో ఈ లెక్కన 4.029 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి. కానీ శనివారం సాయంత్రానికి ఇందులో కేవలం 60.8 వేల టన్నుల బొగ్గే అందుబాటులో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ పవర్ పోర్టల్ భద్రాద్రిని క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్టుగా పేర్కొంది.
అంటే సాధారణంగా ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో కేవలం 15 శాతమే అందుబాటులో ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రతిరోజూ 16.8 వేల టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి ఉండగా.. శనివారం నాడు భద్రాద్రికి 13.8 వేల టన్నుల బొగ్గు రవాణా జరిగింది. నిల్వలో నుంచి 14.3 వేల టన్నుల బొగ్గును థర్మల్ పవర్ జనరేషన్‌కు ఉపయోగించారు. వాస్తవానికి ప్రతిరోజూ 16.8 వేల టన్నుల బొగ్గు (85 శాతం పీఎల్‌ఎఫ్) రవాణా కావాలి. కానీ గడిచిన కొద్ది రోజులుగా 13 నుంచి 14.5 వేల టన్నుల బొగ్గు మాత్రమే రవాణా అవుతున్నట్టు సమాచారం. దీనితో భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు క్రిటికల్ స్థాయికి పడిపోయాయి.
ఇతర థర్మల్ ప్లాంట్లు..
ఇక రాష్ట్రంలో ఉన్న ఇతర థర్మల్ పవర్ ప్లాంట్ల విషయానికి వస్తే.. వాటిలో సాధారణ బొగ్గు నిల్వలు ఉన్నట్టుగా నేషనల్ పవర్ పోర్టల్ తెలిపింది. ఇందులో కేవలం సింగరేణి ఆధ్వర్యంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 24 రోజులకు సరిపోయేలా సాధారణ బొగ్గు నిల్వలు (3.69 లక్షల టన్నుల బొగ్గు) ఉండాలి. కానీ ఇక్కడ 1.18 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇది సాధారణ నిల్వల్లో 32 శాతం మాత్రమే. అయితే ఈ ప్లాంట్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఇది సింగరేణి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. చుట్టుపక్కల బొగ్గు గనులు ఉన్నాయి. అత్యవసరంగా రవాణా చేసుకునే వెసులుబాటు ఉండనే ఉంది.
ఇక మిగిలిన అన్ని థర్మల్ ప్లాంట్‌లలో కూడా 56 శాతం నుంచి 81 శాతం వరకు బొగ్గు నిల్వలు ఉండటంతో ఎలాంటి ఇబ్బందీ తలెత్తే అవకాశం లేదు. అయితే ఇతర కారణాలను చూపిస్తున్నప్పటికీ.. ఒక్క భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలోనే బొగ్గు నిల్వలు ‘క్రిటికల్’ పరిస్థితిలో ఉండటం గమనార్హం. దీనిపై ఇటు ప్రభుత్వం, అటు సింగరేణి కూడా దృష్టి సారించి సాధారణ స్థాయిలో నిల్వలను అందుబాటులో ఉంచేలా బొగ్గు రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది.