18-01-2026 02:08:26 AM
సంగారెడ్డి, జనవరి 17 (విజయక్రాంతి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవితంలో పోటీ చేయనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానం చేసిననేమో అని ఫీల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. నాకోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే నన్ను ఇక్కడ ఓడించారు.. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని తెలిపారు.
నా భుజంపై చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించాలని అడిగితే నన్ను ఇక్కడి వారు ఓడించారన్నారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిదని వాపోయారు. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు, పెద్దలదన్నారు. రానున్న రోజుల్లో సంగారెడ్డిలో నా భార్య నిర్మలా పోటీ చేసినా కూడా నేను ప్రచారానికి రానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయనని జగ్గారెడ్డి తెలిపారు.