calender_icon.png 18 January, 2026 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ పెట్టుబడులే లక్ష్యంగా ‘దావోస్’

18-01-2026 01:07:29 AM

  1. మూడోసారి పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం
  2. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా వ్యూహం
  3. తెలంగాణ బ్రాండ్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్
  4. రేపటి నుంచి 23 వరకు ప్రతిష్ఠాత్మక సమావేశం 

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి) : ప్రపంచ పెట్టుబడుల మహా వేదికగా పేరొందిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు తెలంగాణ మరోసారి సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సమావేశాన్ని రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ గేట్‌వేగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా ప్రభుత్వం సమగ్ర, లక్ష్యబద్ధమైన వ్యూహాన్ని రూపొందించింది. ముఖ్య మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దావోస్‌కు వెళ్లనుంది. దావోస్ సదస్సు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ నాయకులు, విధాన రూపకర్తలు కలిసే అత్యంత ప్రభావవంతమైన వేదికగా నిలుస్తుంది.

పెట్టుబడుల ఒప్పందాలు, భాగస్వా మ్యాలు, భవిష్యత్ ఆర్థిక వ్యూహాలపై చర్చలు ఇక్కడే జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం గత రెండు పర్యటనల్లో ఈ వేదికను సమర్థంగా వినియోగించుకుని రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా నిలబెట్టింది. ఈ అనుభవంతో మూడో పర్యటనను మరింత వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. దావోస్ సదస్సు సందర్భంగా ఈ సారి తెలంగాణ ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు బహుముఖ ఎజెండాతో సాధారణ ప్రెజెంటేషన్‌తో కా కుండా, రంగాలవారీ స్పష్టమైన కార్యాచరణతో వెళ్తోంది. ముఖ్యంగా నాలుగు కీలక రంగాలపై ప్రధాన దృష్టి సారించింది. 

ప్రాధాన్య రంగాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగం లో హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ హబ్‌గా నిలబెట్టే దిశగా గ్లోబల్ టెక్ సం స్థల ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నది. సెమీకండక్టర్ రంగంలో చిప్ డిజైన్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సప్లై చైన్ భాగస్వామ్యాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. భారత సెమీకండక్టర్ ఎకో సిస్టమ్‌లో తెలంగాణను కీలక కేంద్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయం. గ్రీన్ ఎనర్జీ అండ్ ఈవీ రంగంలో సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్లు, బ్యాటరీ ప్లాంట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఒప్పందాలే లక్ష్యంగా పెట్టుకుంది.

స్టార్టప్ ఎకోసిస్టమ్ రంగంలో అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, గ్లోబల్ యాక్సిలరేటర్లు, టెక్ ఇంక్యుబేటర్లతో భాగస్వామ్యాలను ఏర్పరచి తెలంగాణ స్టార్టప్లకు ప్రపంచ వేదిక కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఫార్మా సైన్సెస్ రంగంలో బయోటెక్ పరిశోధనా కేంద్రాలు, డ్రగ్ రీసెర్చ్ ల్యాబ్స్, మెడికల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు దిశగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. 

‘సీఎం నేతృత్వంలో హైప్రొఫైల్ మీటింగులు

దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. తెలంగాణ గేట్ వే టూ ఇండియాస్ ఫ్యూచర్ ఎకానమీ అంశాన్ని థీమ్‌గా ఎంచుకున్నది. ఈ ప్రెజెంటేషన్‌లో హైదరాబాద్ ఐటీ విజయగాథ, ఫార్మా క్యాపిటల్‌గా రాష్ట్ర స్థానం, మౌలిక సదుపాయాల పురోగతి, పరిశ్రమలకు సులభమైన అనుమతులు, పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలను అందించడంపై వివరించనున్నారు. సీఎం నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దావోస్‌లో వరుసగా గ్లోబల్ సీఈవోలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ముఖాముఖి భేటీలు నిర్వహించనుంది. కొన్ని కీలక కంపెనీలతో ముందస్తు సమావేశాలు ఇప్పటికే షెడ్యూల్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గత రెండు దావోస్ పర్యటనల్లో తెలంగాణకు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు, గ్లోబల్ కంపెనీల ఆసక్తి, అంతర్జాతీయ గుర్తింపు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ అనే ఇమేజ్ లభించాయి. ఈసారి వాటిని ఒప్పందాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. గత అనుభవాల ఆధారంగా ఈసారి ప్రభుత్వం మూడు ప్రధాన వ్యూహాలను అమలు చేస్తోంది. రెడీ ప్రాజెక్ట్ జాబితాలో భాగంగా ఖాళీ ప్రతిపాదనలు కాకుండా అమలుకు సిద్ధమైన ప్రాజెక్టులతో వెళ్లడం, ఫాలో-అప్ మెకానిజంలో భాగంగా దావోస్ తర్వాత ఒప్పందాల అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఫాస్ట్-ట్రాక్ అనుమతులు ఇవ్వడంలో భాగంగా పెట్టుబడులకు వేగవంతమైన క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దావోస్ పర్యటనను భవిష్యత్ ఆర్థిక వ్యూహానికి కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది.