18-01-2026 01:54:46 AM
దశాబ్దకాలంలో మూడో వంతు తగ్గిన వైనం
58 వేల నుంచి 40 వేలకు తరిగిపోయిన కార్మికులు, ఉద్యోగుల సంఖ్య
కొత్త బొగ్గు బ్లాకులు లేవు.. భర్తీ ప్రక్రియ అంతంతే..
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): దేశంలో అత్యంత చరిత్ర ఉన్న సంస్థ సింగరేణి. రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతియేటా లా భాలను అందిస్తూ, రాయల్టీలను చెల్లిస్తున్న సంస్థ. అయితే తెలంగాణకు కొంగు బంగారంలా ఉన్న సింగరేణి సంస్థలో ఉపాధి అవకాశాలు ఏటికేడాది తగ్గుతున్నాయి. ప్రతి సంవత్సరం సింగరేణిలో రిటైర్డు అవుతున్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్యతో పోల్చితే ఈ సంస్థలో కొత్తగా ఉద్యోగాలు పొందుతున్నవారి సంఖ్య చాలా స్వల్పం. దీనికితోడు, కొత్త బొగ్గు బ్లాక్‌లు రాకపోవడంతో గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు మూడో వంతు ఉద్యోగులు, కార్మికులు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
కేవలం పదేండ్ల కాలంలోనే సుమారు 18 వేల మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు సింగరేణి సంస్థలో తగ్గిపోవడం గమనార్హం. రా ష్ట్రంలో భారీ సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో సింగరేణి అగ్రస్థానంలో ఉంటుంది. విద్యుత్తు, ఆర్టీసీ, పోలీసు శాఖలు సింగరేణి తర్వాతే ఉం టాయి. అయితే ఇతర సంస్థల్లో ఉన్న పరిస్థితులకు, సింగరేణికి మాత్రం పొంతన ఉండటం లేదు. ప్రతి సంస్థలోనూ ప్రతియేటా కార్మికులు, ఉద్యోగులు భారీ సంఖ్యలోనే రిటైర్డ్ అవుతూ ఉంటారు. అలాగే సింగరేణిలోనూ రిటైర్డ్ అవుతున్నారు.
అయితే ఇతర సంస్థల్లో మాత్రం వారి అవసరాలమేరకు రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సంఖ్యకు కాస్త అటూ ఇటూగా భర్తీ ప్రక్రియ సాగుతోంది. పోలీసు, విద్యుత్తు సంస్థల్లో పెరుగుతున్న అవసరాలమేరకు రిటైర్డు అవుతున్నవారి సంఖ్యకంటే ఎక్కువగానే భర్తీని కొనసాగిస్తున్నారు. కానీ సింగరేణిలో మాత్రం రిటైర్డ్ అవుతున్న కార్మికుల సంఖ్యకు.. కొత్తగా వివిధ స్థాయిల్లో భర్తీ చేస్తున్న సంఖ్యకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. దీనితో ప్రతియేటా సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య ఏటికేడాది తగ్గిపోతూ వస్తున్నది.
దశాబ్దంలో.. 18 వేలకు పైగా..
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన సింగరేణి లాంటి సంస్థల్లో భర్తీ ప్రక్రియ చాలా తక్కువగా కొనసాగుతున్నట్టుగా అర్థమవుతోంది. 2014-15లో 58837 మంది కార్మికులు సింగరేణిలో ఉండగా.. 2024-25 (మార్చి 31 నాటికి) ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు ఈ సంఖ్య కాస్తా 40716 మందికి పడిపోవడం ఆందోళన కల్పించే అంశమనే చెప్పవచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య (2014-15తో పోల్చితే) ఏకంగా 31 శాతం వరకు ఉండటం గమనార్హం. స్పష్టంగా చెప్పాలంటే.. గడిచిన పదేండ్లలో సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 18121 మంది తగ్గిపోయారు.
ఇది 2014-15లో ఉన్నవారి సంఖ్యలో 31 శాతం కావడం.. అంటే మొత్తం ఉద్యోగుల్లో దాదాపు మూడో వంతు కావడం ఆందోళనకు కారణమవుతోంది. ఇదిలా ఉండగా.. పదేండ్ల లో 18 వేల మందికిపైగా ఉద్యోగులు తగ్గిపోగా.. ఇందులోనూ.. కేవలం ఐదేండ్లలోనే 14 వేల మందికిపైగా ఉద్యోగులు, కార్మికులు తగ్గిపోవడాన్ని ఇక్కడ గమనిం చవచ్చు. 2016-17 లో 2206 మంది ఉద్యోగులు, కార్మికులు తగ్గిపోగా.. 2017 -18లోనూ అదేస్థాయిలో తగ్గారు. ఇక 2018-19లో అయితే ఏకంగా 5101 మంది ఉద్యోగులు తగ్గిపోవడాన్ని ఇక్కడ గమనించాలి.
అలాగే 2019-20 నుంచి 2020-21లలో.. అంటే రెండు సంవత్సరాల్లో సింగరేణిలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో మరో ఐదు వేల మందికిపైగా కార్మికులు తగ్గిపోయారు. ఒకవంక పెద్ద సంఖ్యలో రిటైర్డు అవుతుంటే.. మరోవంక అనారోగ్యం కారణంగా మెడికల్ అన్‌ఫిట్‌తో వందలాది మంది కార్మికులు సింగరేణికి దూరమవుతున్నారు. ఇలా తగ్గిపోతున్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సింగరేణి సంస్థ కల్పించలేకపోతోంది.
చిగురిస్తున్న ఆశలు..
ఈ భిన్నవైఖరి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇతర ప్రైవేటు బొగ్గు సంస్థల మాదిరిగానే సింగరేణికూడా ఓపెన్ ఆక్షన్ (బహిరంగ వేలంపాటల్లో) పాల్గొని, కొత్త బొగ్గు బ్లాకులను చేజిక్కించుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో మరోసారి సింగరేణిలో ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనపై ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే ఒకట్రెండు నెలల్లో బొగ్గు బ్లాక్‌ల వేలంపాటలో పాల్గొనడం ద్వారా సుమారు 10 బొగ్గు బ్లాక్‌లను వశం చేసుకునేలా సింగరేణి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు యాజమాన్యం అంటోంది.
అయితే ఒక పక్క యాంత్రీకరణ సాగుతూనే.. తెలంగాణలోని యువతకు పెద్దయెత్తున ఉపాధి అవకాశాలను గతంలోలాగానే కల్పించేలా ముందకు వెళుతుందనే ఆశను తెలంగాణ యువత వ్యక్తం చేస్తుండగా.. కనీసం కొత్త బొగ్గుగనులను దక్కించుకున్న తరువాత సింగరేణికూడా అదే స్థాయిలో రిక్రూట్‌మెంట్లతో ముందుకు వెళుతుందా.. లేక ప్రస్తుతం ఉన్న ఒరవడినే కొనసాగిస్తుందా అనేది భవిష్యత్తే తేల్చనుంది.
కొత్త గనులు లేమి
గడిచిన దశాబ్ద కాలంలో సుమారు 18 వేల మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మాత్రం.. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు రాకపోవడమేననేది బహిరంగ రహస్యమే. విభిన్నంగా, వినూత్నంగా కొత్త వ్యాపారాలను చేపడుతూ ఒకింత ఆర్థికంగా ముందుకు సాగుతున్న సింగరేణి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో మాత్రం గతంతో పోటీపడలేకపోతోంది. కేంద్రంతో భిన్నమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం సాగడం కారణంగా.. గడిచిన పదేండ్లలో కొత్త బొగ్గు గనులను సింగరేని సాధించుకోలేకపోయింది. గతంలో మాదిరిగా కేంద్రమే కొత్త బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలనే గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించుకోలేకపోయింది.
