calender_icon.png 9 October, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెత్తనం మాటున పెద్ద చిక్కు

09-10-2025 01:27:11 AM

  1. స్థానిక ఎన్నికల్లో గెలుపుగుర్రాల ఎంపికకు సమన్వయ కమిటీలు వేసిన కాంగ్రెస్ 
  2. ప్రతి మండలానికి ఓ కమిటీ ఏర్పాటు
  3. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక వారి బాధ్యత
  4. ప్రతి మండలం నుంచి ఐదుగురికి పైగా ఆశావహులు
  5. వారిలో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు
  6. ఎంపికకాని వారు కమిటీ సభ్యులపై తిరుగుబాటు
  7. అవమానంతో మదనపడుతున్న సీనియర్ నాయకులు

సూర్యాపేట, అక్టోబర్ 8 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. మొదట జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతున్నందున జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.

ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అధికార పార్టీ మండల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా కమిటీ సభ్యులు ఆశావహుల జాబితా తయారు చేయడంలో తలమునకలయ్యారు.

మండల స్థాయిలో కమిటీలు 

సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ మండలానికో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్యను ఆయా మండలాల్లో ఉన్న ఎంపీటీసీల స్థానాన్ని బట్టి నిర్ణయించారు. చిన్న మండలాలు అయితే కమిటీలో తక్కువ మంది, పెద్ద మండలం అయితే కమిటీలో ఎక్కువ మంది సభ్యులను చేర్చినట్టు తెలుస్తుంది. ఈ కమిటీలు ఇప్పటికే గ్రామాలలో ఆశావహుల జాబితా తయారీ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఈ కమిటీల వద్ద భారీగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామం నుంచి సుమారుగా 10 నుంచి 15 మంది ఎంపీటీసీ స్థానానికి పోటీకి ముందు వస్తున్నారు. 

అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సామే.. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ఈ కమిటీ సభ్యులకు కత్తిమీద సాములాగా మారింది. ఒక్కో గ్రామం నుంచి ఎంపీటీసీ స్థానానికి పదిమందికి పైనే పేర్లు నమోదు చేసుకోవడంతో వారి అందరికీ నచ్చజెప్పి ఒకరిని పోటీలో నిలిపేందుకు వారు అష్ట కష్టాలు పడాల్సివస్తున్నట్లు సమాచారం. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి బతిమిలాడడం, బెదిరించడం, నచ్చజెప్పడం, ఉన్న వాస్తవిక పరిస్థితులను వివరించడం వంటివి చేపట్టి కొందరిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు కమిటీ సభ్యులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

కమిటీ సభ్యులపై దూషణలు 

ఆశావాహుల జాబితా నుంచి అసలు అభ్యర్థిని ఎంపిక చేసే క్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో పేర్లు తొలగించిన కొందరు బాధపడుతుండగా, మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. నన్నే తొలగిస్తారా అంటూ వాదనలకు దిగుతున్నారు. జిల్లాలోని ఓ పెద్ద మండలానికి చెందిన ఓ ఆశావాహుడు సమన్వయ కమిటీ సభ్యులను నా పేరులో జాబితాలో చేర్చరా మీకు ఎంత ధైర్యం అంటూ వ్యక్తిగత దూషణలకు దిగినట్టు సమాచారం.

అయితే ఈ విషయం గురించి సభ్యులు పార్టీ అధిష్టానానికి సైతం సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. జిల్లాలోని పలుచోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో సర్ది చెప్పలేక, అవమానం భరించలేక సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరు సీనియర్ నాయకులు తమలో తామే మదనపడుతూ తమ సన్నిహితుల దగ్గర మనసులో మాట బయటపెట్టిన్నట్టు తెలిసింది.

ఈ విషయం గ్రహించిన పార్టీ పెద్దలు జడ్పిటిసి అభ్యర్థి ఎంపిక క్లిష్టతరంగా ఉన్నచోట ముగ్గురు కంటే తక్కువ అభ్యర్థుల జాబితాలు తయారుచేసి పంపమన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఎంపీటీసీ స్థానానికైతే బుజ్జగింపులు, అవకాశం ఉన్నచోట హామీలు ఇచ్చి ఎక్కడికక్కడ సర్దుబాటు చేస్తున్నట్టు తెలిసింది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్, అటు బీజేపీలోనూ ఇదే విధానం ఉన్నప్పటికీ అధికారంలో లేని కారణంగా ఆ పార్టీలకు సమస్య ఇంత జటిలంగా లేదనేది బాహటంగానే తెలుస్తున్న విషయం. 

అడుగడుగునా అడ్డంకులు 

సమన్వయ కమిటీ సభ్యులు ఆశావాహల జాబితాను తయారుచేసి అందులో నుంచి గెలుపు గుర్రాలను ఎంపిక చేసే క్రమంలో వారికి అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. జడ్పీటీసీ స్థానానికి అ యితే అభ్యర్థిని ఎంపిక చేయడం మ రింత క్లిష్టతరంగా మారినట్టు వినికిడి. ఒక్కో మండలం నుంచి మూడు నుం చి ఐదుగురు తమ పేర్లను నమోదు చేయడంతో ఎవరిని తొలగించాలి ఎవరిని పోటీలో ఉంచాలనేది కష్టతరంగా మారినట్లు తెలుస్తుంది.

పేర్లు నమోదు చేసుకున్న వారు తమకు ఉన్న సంబంధాలు, పలుకుబడిని ఉపయోగించుకొని ఎవరికి వారు తమకే సీటు వచ్చేలా విశ్వప్రయత్నా లు చేస్తున్నారు. అయితే గెలిచే వారికే అవకాశాలంటూ కమిటీ సభ్యులు తేల్చి చెపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.