11 April, 2026 | 4:27 AM

నర్మెటలో బయోగ్యాస్ ప్రాజెక్ట్

11-04-2026 02:23 AM

రేపు భూమిపూజ చేయనున్న మంత్రి శ్రీధర్‌బాబు

నంగునూరు, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): వ్యవసాయ, పశువుల వ్యర్థాలను ఇంధనంగా మార్చే బృహత్తర ప్రాజెక్టుకు తెలంగాణ వేదిక కానుంది. జూనో జౌల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వద్ద ప్రతిష్టాత్మక కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టును ఆదివారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు భువనేశ్వర్ కలిత భూమిపూజ చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా వరి పొట్టు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలను ముడిసరుకుగా వాడుకుని రోజుకు 100 టన్నుల బయో-గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. క్లస్టర్ పద్ధతిలో 10 ప్లాంట్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ 2030 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ‘గోబర్ధన్’ పథకం కింద నిర్మిస్తున్న ఈ ప్లాంట్ భూమిపూజకు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్‌రావు తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 400 మందికి ఉపాధి లభించనుంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ మరో ఫ్యాక్టరీ రావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.