calender_icon.png 4 August, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్లను దొంగిలిస్తున్న బీజేపీ!

03-08-2025 12:59:02 AM

  1. బీహార్‌లో 65 లక్షల ఓట్లను గల్లంతు చేసింది
  2. కులం, మతాల పేరుతో విచ్ఛిన్నం 
  3. రాహుల్ మార్గదర్శకంలోనే జనహిత పాదయాత్ర
  4. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 
  5. కేసీఆరే దోషి అని కాళేశ్వరం తేల్చింది..
  6. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
  7. సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రెండోరోజు జనహిత పాదయాత్ర 

సంగారెడ్డి, ఆగస్టు 2 (విజయక్రాంతి): దేశంలో బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతూ అరాచకం సృష్టిస్తుందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక మార్గదర్శకాన్ని సూచించారని, అందులో భాగంగానే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి నిర్వహి స్తున్న జనహిత పాదయాత్ర శనివారం సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రెండో రోజు కొనసాగింది.

సంగారెడ్డి జిల్లా అందో లు నియోజకవర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. జోగి పేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల ఆవరణలో చెత్తాచెదారం, పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్ మొక్కలు నాటారు. విద్యార్థులతో సమావేశమయ్యా రు.

అనంతరం సంగుపేట శివారులోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. అందోలు నియోజకవర్గం నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు నేతలు చేరుకుని జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఆర్మూర్‌లోని కింద గల్లీ (ఆలూర్ బైపాస్) నుంచి గోలబంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదిగా పెర్కిట్ చౌరస్తా వరకు జరిగింది.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. స్వాత్రంత్య్ర సంగ్రామంలో సమరయోధులు ఎలా ప్రజా యాత్రలు నిర్వహించారో అలాగే స్వాతంత్య్రం వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో పాదయాత్రలను చేపట్టిందన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుం చి కాశ్మీర్ వరకు ఆరు నెలల పాటు నిర్వహించిన జోడో యాత్ర దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. తెలంగాణలో కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు టీపీసీసీ జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో అరాచకం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు లేకుం డా చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అందులో భాగంగానే బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగించిందన్నారు. ఇంతటి అరాచకం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు. బీజేపీ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని, చివరికి ఓటును దొంగిలిస్తుందని విమర్శించారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కార్ పాటుపడుతున్నదని చెప్పారు.

గత పదేళ్ళు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్‌ఎస్ దెబ్బతీసిందని విమర్శిం చారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మం ది బలిదానం అయ్యారని, సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆత్మబలిదానాల ఆశయాలను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. తెలం గాణలో గ్యారంటీ పాలన అందించడానికి రాహుల్‌గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇదే తరహాలో పనిచేస్తుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని, ఇదే లక్ష్యంతో ప్రతీ వాగ్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ఏకతాటిపై పనిచేసి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని సూచించారు. 

కేసీఆరే దోషి: మహేశ్‌కుమార్ 

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని వృథా చేశారని, ఆయనను దోషిగా కాళేశ్వరం కమిషన్ తేల్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నియంతలా వ్యవహరించి అనుభవజ్ఞలైన ఇంజనీర్ల మాటను వినకుండా సొంత నిర్ణయాలతో ప్రాజెక్టు కట్టించారని విమర్శించారు.

తండ్రి, అల్లు డు ప్రాజెక్టులో అవినీతికి పాల్పడితే ఈ - కార్ రేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అంటూ ప్రశ్నించారు. ప్రజల సొ మ్మును తిరిగి కక్కకతప్పదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపా డడమే కాకుండా ఒక్క నీటి బొట్టును కూడా వదలమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, హరీష్‌రావు గత ప్రభుత్వంలో ఏపీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందాల కారణంగానే బనకచర్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చిందన్నారు. 

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: మంత్రి దామోదర 

రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ఐక్యంగా కృషి చేసి కాంగ్రెస్ సత్తాను చాటాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడమే కాకుండా ప్రజలతో పాలకులు మమేకమవ్వడానికే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమాలను అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

పార్టీలో కుమ్ములాటలు సహజ మే కానీ వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పటిష్టత కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మె ల్యే సంజీవరెడ్డి, పటాన్‌చెరు ఇంచార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.