07-11-2025 12:42:46 AM
రూ.8 కోట్ల ప్రజల సొమ్ము నీళ్ళపాలు
చెత్త, మద్యం సీసాల కుప్పలుగా మారిన ప్రాంగణం
అసాంఘిక చర్యలకు అడ్డాగా మారిన వైనం
మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యానికి పరాకాష్ట
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు
రామచంద్రపురం, నవంబర్ 6:పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మున్సిపల్ ఫంక్షన్ హాల్ ఇప్పు డు ప్రజలకు అందుబాటులో లేకపోగా నిర్లక్ష్యం, అసాంఘిక చర్యలకు అడ్డాగా మారింది. ప్రజా సౌకర్యార్థం నిర్మించిన ఈ భవనం చుట్టుపక్కల చెత్త, పగిలిన గాజు సీ సాలు, మలినాలు పేరుకుపోవడంతో ప్రాం గణం దుర్వాసనతో నిండిపోయింది.
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాళ్ళలో పేద, మధ్య తరగతి కుటుంబీకులు శుభకార్యాలు చేసుకోవడానికి లక్షలాది రూ పాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్య తరగతి కుటుం బాలకు అందుబాటులోకి తీసుకువచ్చేందు కు ప్రభుత్వ నిధులతో ఫంక్షన్ హాల్ ను రూ.8 కోట్లతో నిర్మాణం చేసి ప్రారంభించా రు.
ఈ ఫంక్షన్ హాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లోపం కా రణంగా ఇప్పటి వరకు ఎవరు కూడా అం దులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఫంక్షన్ హాల్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం మున్సిపాలిటీకి చెందుతుంది. సరియైన పర్యవేక్షణ, నిర్వహణ చేసివుంటే తెల్లాపూర్ మున్సిపాలిటీకి సరియైన ఆదా యం వచ్చేదని ప్రజలు వాపోతున్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా...
ఫంక్షన్ హాల్ వెనుకభాగం పూర్తిగా చెత్తతో కప్పబడి ఉండగా, రాత్రివేళల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఈ హాల్ ఇంత దయనీయ స్థితిలో ఉండటం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన ఈ భవనం ఇంత చెత్తగా మార డం బాధాకరమని, తక్షణమే అధికారులు స్పందించి శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అంతేగాకుండా ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అధికారులు అరికట్టాలని డి మాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందు బాటులో లేరు.