16-10-2025 01:52:41 AM
గతేడాది డిసెంబర్ నుంచి అందని భృతి
ఖాళీ కడుపుతో పాఠాలు ఎలా బోధించేదని ప్రశ్నిస్తున్న లెక్చరర్లు
ఖమ్మం, అక్టోబరు 15 (విజయక్రాంతి) : చేసిన పనికి నెలనెలా జీతం అందితేనే మధ్య తరగతి కుటుంబం జీవితం సాఫీగా సాగుతుంది. ఒక్క నెల జీతం కాస్త అటు ఇటు అయినా ఇబ్బందుల పాలు కాక తప్పదు. అలాంటిది దాదాపు పది నెలలుగా జీతాలు అందకపోతే ఆ ఉద్యోగస్తుడి పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు.
వినేవారికి ఇది కాస్త అవాస్తవంగా అనిపించడంతో పాటు, 10 నెలల పాటు జీతం ఇవ్వని సంస్థ ఎక్కడైనా ఉంటుందా? అనే ప్రశ్న వ్యక్తమవుతుంది. జిల్లాలోని జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్లు ఈ పరిస్థితిని నిజంగానే అనుభవిస్తుండగా, ఇన్ని నెలల నుంచి జీతం బకాయిలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ‘హవ్వా‘ అనిపించక మానదు!
ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం దాదాపు జిల్లాలో గతేడాది దాదాపు 70 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేశారు. వీరికి పోయిన ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి కి సంబంధించిన నాలుగు నెలల జీతం రావాల్సి ఉంది. ఇక ఈ ఏడాది 34 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తూ ఉండగా, వీరికి ఈ విద్యా సంవత్సరం అంటే జూన్ నుంచి ఇప్పటివరకు జీతాలు అందలేదు.
ఈ లెక్కన చాలామంది గెస్ట్ లెక్చరర్లు దాదాపు పది నెలల నుంచి జీతాలు అందుకోలేదు. మధ్య తరగతి జీవులకు ఇన్ని నెలల పాటు జీతాలు పెండింగ్ లో పెడితే ఎలా? ఖాళీ కడుపుతో పాఠాలు ఎలా బోధించాలి? అనే ప్రశ్నలను గెస్ట్ లెక్చరర్లు వ్యక్తం చేస్తున్నారు. జీతాల విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంటే, సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరో విధంగా వ్యవహరిస్తోంది.
అసలు జిల్లాలో ఎంతమంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు? ఎంతమందికి జీతం అందాలి? అనే దానిపై సంబంధిత శాఖకు సరైన స్పష్టత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేసే వారి జాబితాకు, జీతాలు అందుకోవాల్సిన జాబితా మధ్య పొంతన లేదని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుత విద్యా సంవత్సరంలో బోధన చేసే గెస్ట్ లెక్చరర్లకు జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మధ్యతరగతి జీవులకు ఇన్ని నెలల పాటు జీతాలు పెండింగ్లో పెడితే ఎలా? ఖాళీ కడుపుతో ఎలా బోధించాలి? బోధన చేస్తున్న వారి జాబితా సరిగా కూర్పు చేయకపోవడం ఏమిటి? దీనివల్ల గెస్ట్ లెక్చరర్లకు నష్టం చేకూరితే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని పెండింగ్ జీతాలు ఇప్పించడంతోపాటు ఇక నుంచి అందించే జీతాలను ఆలస్యం చేయకుండా అందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు? అనే దాని స్పష్టత తీసుకొని అందరికీ జీతం బకాయలు అందేలా చూడాలని కోరుకుంటున్నారు.
పెండింగ్ ఎన్నాళ్ళిలా..?
గతేడాది పని చేసిన వారికి నాలుగు నెలల జీతం పెండింగ్ ఉండగానే సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడం వల్ల కొన్ని లెక్చరర్ పోస్టులు భర్తీ అయ్యాయి. దీంతో గతేడాది పనిచేసిన కొంతమంది గెస్ట్ లెక్చరర్లు ఈ ఏడాది రెన్యువల్ కు నోచుకోలేదు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిగిలిన ఖాళీ లెక్చరర్ పోస్టులకు ఎంతమంది అవసరమవుతారో సంబంధిత శాఖ అంచనా వేసింది.
అందుకు అనుగుణంగా అవసరమైన గెస్ట్ లెక్చరర్ లను నియమించింది. వీరికి కూడా ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచి జీతాలు పెండింగ్లో పెట్టింది. వెరసి 8 నెలల జీతం పెండింగ్ లో ఉంది. గెస్ట్ లెక్చరర్ల యూనియన్ నాయకులు సంబంధిత శాఖ కమిషనర్ కు ప్రభుత్వానికి పదేపదే తమ ఇబ్బందులను విన్నవించుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం గెస్ట్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి ఆమోదం లభిస్తే గానీ, గతేడాది జీతాలు అందించబోమని సంబంధిత శాఖ కమిషనర్ చెప్పటంతో, పైన గెస్ట్ లెక్చరర్ నాయకులు చర్చలు ప్రారంభించారు. ఈ క్రమంలో సంబంధిత శాఖ ఈ ఏడాదికి సంబంధించిన నాలుగు నెలల జీతాలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం లభించినట్లయిందనే విషయం అర్థమవుతోంది. ఈ లెక్కన సంబంధిత శాఖ కమిషనర్ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, గత ఏడాది బకాయిలు కూడా విడుదల చేయాల్సి ఉంది. కానీ, అవేమీ పట్టించుకోకుండా, ప్రస్తుతం ఏడాది జీతం బకాయలు మాత్రమే విడుదల చేయడం ఏమిటన్నది గెస్ట్ లెక్చరర్ వాదన! ఇదే ప్రశ్నకు సంబంధిత శాఖ జిల్లా అధికారుల నుంచి సరైన స్పందన లేదు.
ఇక ప్రస్తుతం విడుదల చేశామని చెబుతున్న జీతం బకాయిలు కూడా ఇప్పట్లో తమకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని గెస్ట్ లెక్చరర్లు చెబుతున్నారు. వచ్చిన బిల్లులను ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ మొదట ట్రెజరీ జిల్లా శాఖకు పంపించాల్సి ఉంటుంది. అక్కడి అధికారులను బిల్లులను ‘ఈ కుబేర’లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత వరుస క్రమంలో బిల్లులు క్లియర్ అవుతుంటాయి. ఈ లెక్కన తమ నెంబర్ ఎప్పుడు వస్తుందో, జీతాలు తమ ఖాతాలో ఎపుడు జమ అవుతాయో చెప్పే పరిస్థితి లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరి వారి మాటేమిటి..?
గత ఏడాది వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1654 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేసేవారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1256 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగామిగిలిన 398 ఖాళీ పోస్టులకు గెస్ట్ లెక్చర్లను నియమించదల్చుకుంది. అవసరమైన గెస్ట్ లెక్చరర్ల జాబితాను సిద్ధం చేసి పంపించాలంటూ జిల్లా అధికారులను ఆదేశించింది.
ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది 34 మంది గెస్ట్ లెక్చర్లను నియమించుకున్నట్లు సంబంధిత జిల్లా శాఖ జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాదికి సంబంధించిన జీతం బకాయి విడుదల జాబితాలో మాత్రం 22 మంది పేర్లు మాత్రమే ఉండటం గమనార్హం! జీతం బకాయలు విడుదల చేస్తున్నట్లు సంబంధిత రాష్ట్ర శాఖ రూపొందించిన జాబితాలో కూసుమంచి ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన ఒక్క గెస్ట్ లెక్చరర్ పేరు కూడా లేదు.
అలాగే కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల బోటనీ, తెలుగు గెస్ట్ లెక్చరర్ల పేర్లు కూడా లేకపోవడం గమనార్హం! ఈ జాబితాలో పేర్లు లేని గెస్ట్ లెక్చరర్లు జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత జిల్లా శాఖ తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాబితాలో తమ పేరు ఉంటే జీతం కోసం ఏదో విధంగా పోరాడవచ్చని, అసలు పేరే లేకపోతే తాము బోధన చేశామని ఎలా నిరూపించుకునేదని ఈ 12 మంది గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు సక్రమంగా చెల్లించాలి
ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను చిన్నచూపు చూస్తోంది. నెలలకు నెలలు జీతాలను పెండింగ్ లో ఉంచుతోంది. దాదాపు 8 నెలల జీతం పెండింగ్ లో ఉంచింది. దీనిపైన పోరాటాలు చేస్తే ఈ ఏడాదికి సంబంధించిన నాలుగు నెలల జీతాన్ని విడుదల చేస్తున్నామని తెలిపింది. ఈ జీతం ట్రెజరీకి, అక్కడి నుంచి మరో చోటికి, అక్కడ నుంచి మా ఖాతాలోనికి వచ్చేసరికి మరో రెండు మూడు నెలలు పడుతుంది.
అంటే జీతం తీసుకోకుండా దాదాపు ఏడాది పాటు బోధన చేయాల్సిన పరిస్థితి. గతేడాది సంబంధించిన నాలుగు నెలల జీతం గురించి సంబంధిత అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. విడుదల చేసిన జీతం జాబితాలో 12 మంది గెస్ట్ లెక్చరర్ పేర్లు లేవు. వారి పరిస్థితి ఏమిటి? ప్రభుత్వానికి ఇది తగదు. పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి. అలాగే ఈ ఏడాది బోధన చేస్తున్న గెస్ట్ లెక్చరర్లు అందరికీ జీతాలు అందించాలి.
రషీద్, గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్, ఖమ్మం
మరో వారం రోజుల్లో పెండింగ్ జీతాలు అందుతాయి
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ లెక్చరర్ల జీతాలు నాలుగు నెలలవి విడుదల అయ్యాయి. వాటిని త్వరలో ట్రెజరీకి పంపిస్తాం. ఆ తర్వాత వెంటనే జీతాలు సంబంధిత లెక్చరర్ల ఖాతాల్లో జమ అవుతాయి. గతేడాదికి సంబంధించిన పెండింగ్ జీతాలు కూడా త్వరలోనే విడుదల అవుతాయి. ఇక ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో పేర్లు లేని గెస్ట్ లెక్చరర్ల గురించి ఆరా తీస్తాం. అందరికీ జీతాలు అందేలా చేస్తాం.
రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం