24-08-2025 10:53:39 PM
నంగునూరు: రాష్ట్రంలో యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపారు.రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాలమాకుల రైతు వేదిక వద్ద తెల్లవారుజాము నుంచి 800 మంది రైతులు యూరియా కోసం క్యూ లైన్‌లో వేచి చూస్తే, కేవలం 400 మందికి మాత్రమే యూరియా ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు సవాల్ విసిరారు. "మీకు దమ్ముంటే ఏ గ్రామాల్లో PACS కేంద్రాలు, రైతు వేదికల వద్దకు వచ్చి రైతులు పడుతున్న కష్టాలను చూడండి" అని డిమాండ్ చేశారు. రైతుల గోసను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయకపోతే, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాగుల సారయ్య హెచ్చరించారు.