04-11-2025 12:00:00 AM
మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్
వెంకటాపూర్(రామప్ప), నవంబర్ 3 (విజయక్రాంతి): మండలంలోని రామాంజాపూర్ గ్రామంలో సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు పైడాకుల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రామాంజాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరిపాలన, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా బిజేపీ పార్టీలో చేరారు.
అజ్మీరా సీతారాం నాయక్ వారికి బిజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని, దేశంలో వరుసగా మూడోసారి ప్రజల ఆశీర్వాదంతో ప్రధానిగా నరేంద్రమోడీ అవినీతి రహిత పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, దేశ సంక్షేమం మరియు రక్షణ రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపారని, భారతీయ జనతా పార్టీ ప్రజా పక్షాన నిలబడి పోరాడే పార్టీ అని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బిజేపీ అధికారం చేపట్టి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతోందని, అందరూ నరేంద్రమోడీ ’వికసిత్ భారత్’ సంకల్పానికి మద్దతుగా నిలబడి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజేపీ పార్టీ సత్తా చాటాలని అన్నారు.
ఆరెల్లి రాజు, తాల్లపల్లి రమేశ్, పోశాల మహేందర్, భీమినేని శ్రీశైలం, తదితరులు బీజేపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు భూక్య జవహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.