06-11-2025 12:51:41 AM
-బీజేపీకి జనసేన మద్దతు శుభపరిణామం
-ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య
ఖైరతాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయం అని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు పలకడం శుభ పరిణామం అని ఆయన తెలిపారు. బుధవారం ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. జనసేన మద్దతు బీజేపీకి సరికొత్త బలాన్ని చేకూరుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి సాధించిన విజయంలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయపథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. 11న జరగబోయే పోలింగ్ లో ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి మార్గంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్ల దేశం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని తెలిపారు.
దేశ ప్రధాని దూరదృష్టి వల్లే కరోనా వంటి మహమ్మారి సమయంలో ప్రపంచానికి అవసరమైన మందులు, మెడికల్ సామగ్రి సరఫరా చేస్తూ దేశ గౌరవాన్ని పెంచారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మాత్రమే జరిగాయ ని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం తప్ప మిగతా వర్గాలు నిరాశలో ఉన్నారని తెలిపారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించినందుకు హృ దయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.