31-10-2025 12:00:00 AM
 
							హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తిచేశారు. గురువారం నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి పర్యటన చేపట్టారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయరమణరావు తదితరులతో కలిసి ఆయన ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సంద ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ, గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించా రు. రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను తెలియజేశారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై చేస్తున్న నిరాధారమైన దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలంతా అండ గా నిలవాలని విజ్ఞప్తిచేశారు. ప్రచారం అనంతరం శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న కార్నర్ మీటింగ్ ఏర్పాట్లపై స్థానిక నాయకులతో కలిసి శ్రీధర్‌బాబు సమీక్షించారు.