31-10-2025 12:00:00 AM
 
							-ఇద్దరు ముద్దాయిలు నిర్దోషులుగా విడుదల
-నిజామాబాద్ అదనపు సెషన్స్ జడ్జి హరీష తీర్పు
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మహిళ మృతి చెందడానికి కారణమైన హలవత్ కమల కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, పదివేల రూపాయల జరిమానా విదిస్తూ మహిళలపై అత్యాచారాల నేర విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష గురువారం తీర్పు వెలువరించారు. మరో ఇద్దరిపై మహిళపై అత్యాచార నేర నిరూపణ కానందున నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.
కోర్టు తీర్పులోని వివరాలు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బెల్య నాయక్ తాండా నివాసురాలైన హలవత్ కమల కు కల్లు తాగే అలవాటు ఉంది.ఆర్థిక అవసరాల కోసం ఆమె మగవారితో స్నేహం చేసేది. 11 సెప్టెంబర్, 2019 న ఆమె తన బంధువు అయిన సేవాలాల్ తాండా కు చెందిన మహిళను వెంటబెట్టుకుని తన తల్లిగారి గ్రామం అయిన అక్బర్ నగర్ గంగారెడ్డి నగర్ తాండా కు తీసుకువెల్లి అక్కడ ఒక దగ్గర తనకు పరిచయస్తులైన అక్బర్ నగర్ నివాసులు నడిపెంటి ప్రవీణ్, తుర్ర రాజేష్ కుమార్ లను పిలుపించుకుని గ్రామ శివారులోని ఒక పాతబడిన స్కూల్ దగ్గర నలుగురు మద్యం సేవించారు. మహిళలతో సమయం గడిపినందున ప్రవీణ్ ఒక మహిళకు నాలుగు వందల రూపాయలు ఇచ్చాడు.
నాలుగు వందల రూపాయలు నాకే కావాలని కమల గొడవ చేసింది.ఆ మహిళను కమల చేతులతో పిడి గుద్దులు ముఖంపై గుద్ది ఆమెను వెనుకకు నూకివేసింది. కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.మృతి చెందిన మహిళ విషయంలో పిర్యాదు స్వీకరించిన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించుకుని సాక్షుల వాంగ్మూలాలు, సంఘటన కు సంబందించిన వివరాలు, వైద్యులు మృతురాలికి నిర్వహించిన పోస్ట్ మార్టమ్ నివేదిక, డిఎన్‌ఎ, ఫారెన్సిక్ నివేదికలు, వత్తుగత సాక్ష్యాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. ప్రధాన ముద్దాయిగా ప్రవీణ్, రెండవ ముద్దాయిగా రాజేష్ లను చేర్చారు.
వారిపై భారత శిక్షస్కృతి సెక్షన్ 376(2)(కె )లో పేర్కొన్న విదంగా వారిద్దరిపై ఆధిపత్యం ఉన్న వ్యక్తులు చేసే మహిళపై అత్యాచారం నేరారోపణలు, మూడవ ముద్దాయిగా కమలపై మహిళ మృతికి కారణానమైనట్లు నమోదు చేశారు.అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసుకుని, ధ్రువీకరించుకున్న పత్రాలు, వస్తుగతసాక్ష్యాలు మార్క్ చేశారు. ప్రాసిక్యూషన్, ముద్దాయిల తరపున న్యాయవాదుల వాదనలు విన్నారు.
కోర్టు ఇద్దరు ముద్దాయిలు అయిన ప్రవీణ్, రాజేష్ లపై మహిళపై అత్యాచార నేర ఆరోపణలు రుజువు కానందున వారిపై కేసును కొట్టివేస్తు నిర్దోషులుగా విడుదల చేశారు.కమలపై భారత శిక్షస్కృతి సెక్షన్ 304 పార్ట్ 2 మహిళ మృతికి కారణమైనందున పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష, పది వేల రూపాయల జరిమానా విదించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జడ్జి హరీష తీర్పులో పేర్కొన్నారు.పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.