12-07-2025 02:03:44 PM
బిహార్: పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ (Jay Prakash Narayan International Airport) విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు(Bomb Threat ) రావడంతో శనివారం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ బెదిరింపు నిర్దిష్టమైనది కాదని, బూటకమని తేలిందని వారు తెలిపారు. "శుక్రవారం రాత్రి 9 గంటలకు విమానాశ్రయ డైరెక్టర్ ఇమెయిల్ ఐడీకి బాంబు బెదిరింపు వచ్చింది. దీని తర్వాత వెంటనే, బాంబు బెదిరింపు అంచనా కమిటీ (Bomb Threat Assessment Committee) సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ బెదిరింపును నిర్దిష్టమైనది కాదని కమిటీ ప్రకటించింది" అని విమానాశ్రయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామం తర్వాత విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ (పాట్నా సెంట్రల్) దీక్ష మీడియాకి తెలిపారు. బాంబు బెదిరింపు కేవలం బూటకమని, ఈమెయిల్ పంపిన వ్యక్తిని ఐపీ చిరునామాను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.