calender_icon.png 13 July, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తాం: మంత్రి పొన్నం

12-07-2025 09:05:46 PM

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టల్ల భవనాల నిర్మాణానికి జిల్లాల వారీగా సల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

నల్గొండ జిల్లాలో 32 బీసీ సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఉండగా సుమారు 30 అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, వీటన్నిటికి పక్కా భవనాలు నిర్మించేందుకు వెంటనే స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. కులవృత్తులను కాపాడటంలో భాగంగా ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఈత చెట్లు, 5 లక్షల తాటి చెట్లను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే కాటమయ్య రక్షణ కిట్లను ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని , ఉమ్మడి నల్గొండ జిల్లాకు మరో 10 వేల రక్షణ కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదివరకే నల్గొండ దృష్టి పేరుపై మంచి కార్యక్రమాలు నిర్వహించారని,  వీటిని వీటిని కొనసాగిస్తూ, అన్ని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రత క్లబ్బులను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యార్థుల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద 195 కోట్ల మంది మహిళలు 6500 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు.ఆర్టీసీలో 3035 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, హైదరాబాదులో కాలుష్యం తగ్గించేందుకుగాను ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, త్వరలోనే 2,800 బస్సులు హైదరాబాద్లో తిరిగే ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండ జిల్లాకు 77 ఈవి బస్సులను మంజూరు చేయగా, శనివారం సుమారు 40 బస్సులను ప్రారంభించడం జరిగిందని, మంత్రి వెల్లడించారు. నిజాం కాలం నాటి నార్కెట్పల్లి బస్ డిపోను దత్తత తీసుకొని డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తామని, వారం, పది రోజుల్లో రూటింగ్ ను  సెట్ చేస్తామని, నార్కెట్పల్లి డిపోలో బస్సులను మూడింతలు పెంచి వారసత్వ సంపాదన కాపాడుతామని హామీ ఇచ్చారు.

రానున్న కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలక్ట్రిక్ వాహనాల పద్ధతిని అమలు చేయనున్నమని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని చెప్పారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే నిర్ణయం తీసుకొనున్నామని, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ లు చేయనున్నామని చెప్పారు. జిల్లా అటవీశాఖ, డిఆర్డిఓ, బీసీ సంక్షేమ శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఈత, తాటివనాలను పెంచాలని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) మాట్లాడుతూ.. నల్గొండ, మిర్యాలగూడ, నార్కెట్పల్లి బస్సులను పెంచాలని, బీసీ సంక్షేమ హాస్టల్లు, భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, నకిరేకల్ బస్ డిపోను పట్టిష్టం చేయాలని కోరారు.

రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, ముఖ్యంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు వేగం కన్నా ప్రాణముఖ్యం అనే నినాదాలను ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రాయించాలని, డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే సమయంలో కఠినంగా ఉండాలని, తప్పనిసరిగా వ్యక్తులు లేకుండా లైసెన్స్ ఇవ్వవద్దని, దండు మల్కాపూర్ లోని ఫిట్నెస్ సెంటర్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని, మన ఊరు- మనబడి కింద చేపట్టిన పాఠశాల, సంక్షేమ వసతి గృహాలను పూర్తిచేసి వినియోగం లోకి తేవాలని, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో  నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్  రెడ్డి,నాగార్జునసాగర్ శాసనసభ్యులు కొండూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం,ఎమ్మెల్సీ శంకర్ నాయక్,  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు,జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్,  మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్,  తదితరులు పాల్గొన్నారు.