12-07-2025 09:23:26 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ మండలం పటేల్ గూడలోని ఐఐటి చుక్కా రామయ్య ఇష్టా జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కిష్టారెడ్డి పేటలోని SLV కన్వెన్షన్ సెంటర్లో ఇష్టా విద్యాసంస్థల అకాడమిక్ డీన్ వి.ప్రేమ్ కుమార్ అధ్యక్షతన ప్రెషర్స్ డే కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి డి గోవిందరావు, పటాన్ చెరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి డి.గోవిందరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని సాధించాలని సూచించారు.
డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ దశలోనే ఒక మంచి గోల్ పెట్టుకుని కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు మీద దృష్టి పెట్టాలని, అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఐఐటి చుక్కా రామయ్య గారి ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మాట్లాడుతూ... ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. కొత్త పాత విద్యార్థుల మధ్య స్నేహం ఏర్పడేందుకు ఫ్రెషర్స్ డే చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థులు తమ ఆట పాటలతో హోరెత్తించారు.