12-07-2025 09:29:19 PM
బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్
మందమర్రి,(విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గం కేంద్రంలోని ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వివేక్ పట్టించు కోకపోవడం దుర్మార్గమని చెన్నూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ ఆరోపించారు. చెన్నూరులో ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్ల సమ్మె శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గత ఏడు రోజులుగా ట్రాక్టర్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యతను మరిచిపోయి వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, చెన్నూరు ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ విషయాన్ని మర్చిపోయి స్థానికులకు కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తూ గోదావరి ఇసుకను హైదరాబాద్ కి తరలిస్తూ ఇటు దళారి వ్యవస్థను, అటు కాంగ్రెస్ నాయకులను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల్లో ట్రాక్టర్ డ్రైవర్స్ సమస్యలను పరిష్కరించక పోతే వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇసుక రీచ్ ని, లారీలని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మంత్రి వివేక్ ట్రాక్టర్ డ్రైవర్స్ సమ్మెను పరిష్కరించాలని, సమ్మె పరిష్కారంలో విఫలం అయితే వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల హామీ ప్రకారం యువతకు 45 వేల ఉద్యోగాలను కల్పించి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.