12-07-2025 09:35:06 PM
11 మందిపై కేసు నమోదు, నలుగురి అరెస్ట్, కీలక నిందితులు పరారీ...
జిల్లా ఎస్పీ వెల్లడి...
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి గుండా అక్రమంగా తరలించే పశువుల వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ దందాలకు పాల్పడుతూ లక్షల వసూలు చేస్తున్న భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం వివరాలను వెల్లడించారు. నేరడిగొండలో 11 మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. వీరు ముఠాగా ఏర్పడి ప్రధానంగా పశువుల అక్రమ రవాణాను ఆదిలాబాద్ గుండా ఇతర రాష్ట్రాలకు తరలించే వాహనాలను తనిఖీ చేస్తూ వాహన యజమానులు, డ్రైవర్లను బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం, లేనియెడల వారిపై దాడులు చేసి, పోలీసులకు ఫిర్యాదులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూన్నారని తెలిపారు.
ఈ ముఠా సభ్యులలో మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా కానిస్టేబుల్ సందీప్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రోహిత్ షిండే అనే రౌడీషీటర్ జిల్లాలో కీలకంగా వ్యవహరించారన్నారు. వీరికి సహకరించినటువంటి నలుగురు ముఠా సభ్యులు చేతన్ కుమార్, అన్వేష్, మజార్, ఆనంద్ మొత్తం 11 మంది పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా దందాలకు పాల్పడి బెదిరింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.