11-08-2025 12:08:35 AM
మహబూబాబాద్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ముత్యాలమ్మ దేవాలయ కమిటీ నిర్వాహకుడు జాటోత్ హరీష్ నాయక్ ఆధ్వర్యంలో ఈసారి ఘనమైన ఏర్పాట్లు జరిగాయి.
పోతురాజులు, డప్పు దరువులు, ఆటపాటలతో శివసత్తుల పూనకాలతో బోనాలు సమర్పించారు. ఏడాది కాలం పాటు తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించడంతోపాటు మేకలు, గొర్రెపోతులు, కోళ్లు బలిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.