calender_icon.png 18 August, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజృంభిస్తున్న డెంగ్యూ

18-08-2025 12:00:00 AM

  1. సంగారెడ్డి జిల్లాలో సుమారు 90 కేసులు నమోదు 
  2. రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
  3. పల్లెల్లో, మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన పారిశుధ్యం
  4. అభాసుపాలవుతున్న డ్రైడే కార్యక్రమం

సంగారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ఓవైపు వర్షాలు దంచికొడుతుండగా మరోవైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెల్లో, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పేరుకుపోయి దోమల లార్వా పెరిగి పోయి డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఒక్క సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల కేసులు సుమారు 90  నమోదు కాగా, మెదక్ జిల్లాలో 12, సిద్దిపేట జిల్లాలో 6 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య లోపంతో ప్రజలు జ్వరాల భారిన పడుతున్నారు.

గత ఏడాదికి కంటే తక్కువ నమోదైనప్పటికీ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాల్సిన ఫ్రైడే డ్రైడే నిర్లక్ష్యానికి గురవుతోంది. 

పెరుగుతున్న కేసులు..

సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఓ రఘురాం ఇప్పటివరకు సుమారు 90  డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ అధికారులు డెంగ్యూ, వైరల్ కేసులు నమోదవుతున్న ఏరియాల్లో స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు ఆ దిశగా  చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కంటే డెంగ్యూ కేసులు తక్కువగా నమోదైనప్పటికీ రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు డెంగ్యూతో పాటు సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. 

అలసత్వం వీడకుండే ప్రమాదం..

మురుగు కాలువల క్లీనింగ్, తాగునీటి నల్లాల వద్ద నీరు నిలువకుండా చూడడంతో పాటు దోమల మందు పిచికారి చేయాలి. వారంలో ఒకరోజు ఇంటి పరిసరాల్లో నిల్ల నీటిని తోడేయడానికి డ్రైడేను కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. దోమల లార్వా వ్యాప్తిని అరికట్టే గంబుసియా చేపలు, ఆయిల్ బాల్స్ మురుగునీటిలో వదలడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి అంశాలపై ప్రజల కోసం అవగాహన కార్యక్రమాలు గ్రౌండ్ లెవల్‌లో నిర్వహించాలి. 

అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం..

గత ఏడాది కంటే ఈసారి డెంగ్యూ కేసులు తక్కవుగానే నమోదవుతున్నాయి. ఎక్కువగా సాదారణ సీజనల్ వ్యాధుల కేసులు వస్తున్నాయి. అయినప్పటికీ అన్ని పీహెసీలలో, ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. కేసులు నమోదైనప్పటికీ 80 శాతం నెగెటివ్‌గా తేలాయి. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

 నాగనిర్మల, డీఎంహెవో, సంగారెడ్డి