22-11-2025 09:24:22 PM
అలంపూర్: తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన గద్వాల జిల్లా మానపాడు మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బోయ విష్ణుకుమార్ పార్వతీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
అందులో చిన్న కుమారుడు కార్తీక్ నాయుడు(4) ఉదయం పిల్లలతో కలిసి ఆడుకుంటున్న క్రమంలో వ్యవసాయ పనులకు సంబంధించిన ట్రాక్టర్ ను డ్రైవర్ రివర్స్ తీస్తుండగా.. ట్రాక్టర్ వెనకాల ఉన్న కార్తీక్ ను తగిలింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సరదాగా పిల్లలతో కలిసి ఆడుకుంటున్న తమ కుమారుడు ప్రమాదానికి గురై చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.