22-11-2025 09:20:24 PM
వనపర్తి,(విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచే యువత తగిన వ్యాయామాలు చేస్తూ, క్రీడలు ఆడుతూ ఆరోగ్యంగా స్పూర్తివంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలం, మూలమల్ల గ్రామంలో దేశాయి సరళాదేవి లక్ష్మా రెడ్డి క్రీడా ప్రాంగణంలో జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అదేవిధంగా కబడ్డీ క్రీడాకారులు ఆటలు ఆడేటప్పుడు దుమ్ము తగలకుండా, గాయాలపాలు కాకుండా జిల్లా కలెక్టర్ నిధులతో బహూకరించిన నూతన సింథటిక్ మ్యాట్ ను వినియోగంలోకి తెచ్చారు.
కబడ్డీ క్రీడాకారులు వచ్చే సీఎం కప్ లో రాష్ట్రంలో మొదటి బహుమతి సంపాదిస్తే మరో మంచి బహుమతినిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మూలామల్ల గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం ఇచ్చి కబడ్డీ తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్రీడల చైర్ పర్సన్ పద్మాజ రెడ్డిని అభినందించారు. వారి కోరిక మేరకు ఇక్కడ మాలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపున తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా బోధించాలి
ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికబద్ధంగా బోధించాలని కలెక్టర్ అధ్యాపకులను ఆదేశించారు. శనివారం ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలకు మంజూరు చేసిన నిధుల నుండి విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, విద్యా బోధనల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి సుధీర్ రెడ్డి, ఆత్మకూరు తహసిల్దార్ చాంద్ పాషా, ఎంపీడీఓ , గ్రామ పెద్దలు, కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.