calender_icon.png 22 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్ పల్లిలో ఎన్‌.సి.సి. మౌన మరణం… విద్యార్థుల భవిష్యత్తు ఎవరి భరోసా?

22-11-2025 09:24:51 PM

దేశభక్తి పాఠం నేర్పే సంస్థ… మోడల్ స్కూల్‌లో ఎందుకు మూతపడింది?

ప్రమాదంలో అనుమతులు—అధికారుల నిర్లక్ష్యంపై సేవా ఫౌండేషన్ ఫైర్

78 వేల కేడెట్లు దేశ సేవలో… శంకర్ పల్లి విద్యార్థులకు మాత్రం అవకాశమే లేదు

ఎన్‌.సి.సి. కాపాడండి -నరేష్ కుమార్ లేఖతో లేవెత్తిన ప్రశ్నలు

శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని టి.ఎస్. మోడల్ స్కూల్‌లో దేశభక్తి, క్రమశిక్షణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన ఎన్‌.సి.సి. కార్యక్రమం నడపబడటం లేదు. ఈ విషయంపై శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్‌. నరేష్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల శంకర్ పల్లికి వచ్చిన ఎన్‌.సి.సి. అనుమతులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత సాయుధ దళాల యువజన విభాగమైన ఎన్‌.సి.సి. కు దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం ఉంది. న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో 1948లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు శిక్షణనందిస్తోంది. యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాలను పెంపొందించడం ఎన్‌.సి.సి. ప్రధాన లక్ష్యం. ఇటీవల జరిగిన సింధూర్ ఆపరేషన్‌లోనే 78 వేల ఎన్‌.సి.సి. కేడెట్లు పాల్గొని తమ సేవలు అందించారు. 

ఇంతటి ప్రాధాన్యం గల కార్యక్రమం శంకర్ పల్లి టి.ఎస్. మోడల్ స్కూల్‌లో నిర్వహించకపోవడం విచారకరమని నరేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల శారీరక దృఢత్వం, ఆరోగ్యం, మానసిక వికాసానికి దోహదపడే ఎన్‌.సి.సి.ను ఉపాధ్యాయులు, అధికారులు ఎందుకు ప్రోత్సహించడం లేదో ప్రభుత్వం సమగ్రంగా విచారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌, జిల్లా కలెక్టర్ ఈ అంశంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ సమర్పణలో సేవా ఫౌండేషన్‌కు చెందిన అధ్యక్షుడు ఆర్‌. నరేష్ కుమార్‌తో పాటు ప్రెసిడెంట్ & ఫౌండర్ ఆర్‌. సతీష్ (నరేష్ కుమార్), వైస్ ప్రెసిడెంట్ సి. జైరాం రెడ్డి,   వేణేంద్ర చారి, ట్రెజరర్ ఎ. నర్సింహా గౌడ్, జాయింట్ సెక్రెటరి పర్వేద రవి, బ్లాక్ బెల్ట్ సిక్స్ డౌన్ ఇండియా బుక్ ఆఫ్ ద రికార్డ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత ,రవీందర్ యాదవ్ ,సభ్యులు ఎం. నాగమణి, ఆర్‌. బాలకృష్ణ పాల్గొన్నారు.