calender_icon.png 22 November, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక అవసరాల పిల్లలను సంరక్షించడం గొప్ప సేవ

22-11-2025 09:32:08 PM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సేవలందించడంలో విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల ప్రతినిధులు చూపుతున్న సేవ భావన ప్రశంసనీయం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సంరక్షించడం ఓ గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఎటువంటి ప్రత్యేక సపోర్ట్ లేకుండా పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులను అభినందించారు. పిల్లలలోని లోపాలతో పాటు వారి ప్రతిభను, ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు సమాజంలో సమానంగా ఎదగగలరని చెప్పారు. చదవడం, రాయడం వంటి ప్రాథమిక విద్య నేర్పడం ద్వారా వారు స్వయం సమర్థత సాధించేందుకు సహాయపడతుందని చెప్పారు.

పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రం ద్వారా పలు సేవలు, పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాలకు రెంట్ పద్ధతిలో స్థలం కేటాయింపు, ఆర్థిక సహాయం వంటి విషయాలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల ఆరోగ్య సదుపాయాల పరంగా రిమ్స్‌లో అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల ప్రత్యేకంగా చిన్నారుల కోసం ఉచిత గుండె వ్యాధి వైద్య శిబిరం నిర్వహించామని గుర్తుచేశారు.