05-11-2025 12:00:00 AM
-భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ
-క్యూ కడుతున్న కార్పొరేట్ కంపెనీలు
ముంబై, నవంబర్ 4 : మన దేశంలో క్రికెటర్లు, సినిమా స్టార్సే చాలా కార్పొరేట్ కంపె నీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటుంటారు. ఎక్కువ శాతం పురుషాధిపత్యమే దీనిలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. హీరోయిన్స్‌ను కూడా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నియమించుకుంటున్నా క్రీడల్లో మాత్రం చాలా తక్కువ శాతమే మహిళలకు అవకాశం లభిస్తుంటుంది. కానీ సానియా మీర్జా, సైనానెహ్వాల్, పివి సింధు లాంటి స్టార్ ప్లేయర్స్ పలు చారిత్రక విజయాలు సాధించిన తర్వాత క్రమంగా బ్రాండింగ్‌లోనూ మహిళా క్రీడాకారిణుల పాత్ర పెరుగుతోంది.
అటు భారత మహిళల జట్టులో కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ టాప్ బ్రాం డ్స్‌కు ఇటీవల కాలంలోనే ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే పురుష క్రికెటర్లతో పోలిస్తే వీరి ఎండోర్స్‌మెంట్ ఫీజు తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ విజయంతో ఒక్కసారిగా మహిళా క్రికె టర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దాదాపు 100 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత చాలా కార్పొరేట్ కంపెనీలు మన మహిళా క్రికెటర్లతో ఒప్పందాల కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన తర్వాత వారితో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నట్టు సమాచారం.
అంతేకాదు గతంలో చేసుకున్న ఒప్పందాలను మళ్లీ రెన్యువల్ చేసుకోవడంతో పాటు వారు అడిగినంత పారితోషకం ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. నిజానికి ప్రపంచకప్ గెలిచిన కొద్ది గంటల్లోనే భారత స్టార్ క్రికెటర్ల సోషల్ మీడియా ఫాలోవర్లు ఓ రేంజ్‌లో పెరిగారు. స్మృతి మంధాన, జెమీ మా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్‌కౌర్, రాధికా యాదవ్ వంటి స్టార్స్‌కు 2 రెట్లు ఫాలోవర్స్ అమాంతం పెరిగారు. ఇదిలా ఉంటే బ్రాండ్ వాల్యూ పెరగడంతో వారు తీసుకునే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది.
సెమీస్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించిన జెమీమా బ్రాండ్ వాల్యూ 100 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఇప్పటి వర కూ 75 లక్షలు తీసుకుంటున్న ఈ యువ క్రికెటర్ ప్రపంచకప్ విజయం తర్వాత 1.5 కోట్లతో డీల్స్ కుదుర్చుకునేందుకు రెడీ అయింది. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ప్లేయర్‌గా స్మృతి మంధాన కొనసాగుతోంది. స్మృతి బ్రాండ్‌కు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకూ తీసుకుంటోంది. ఆమె దాదాపు 16 పెద్ద బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. మహిళల ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మరికొందరు యువ క్రికెటర్లతో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మొ త్తం మీద ఒక్క విజయంతో మన మహిళా క్రికెటర్లకు భారీ క్రేజ్ వచ్చింది.
వరల్డ్‌కప్ విజయంతో తర్వాత జెమీమాతో ఒప్పందాల కోసం పెద్ద ఎత్తున రిక్వెస్టులు వచ్చినట్టు ఆమె ఎండోర్స్‌మెంట్స్ చూసే సంస్థ జేఎస్‌డబ్లూ సీఈవో కరణ్ యాదవ్ చెప్పారు. దాదాపు 10 బ్రాండ్లతో చర్చలు జరుగుతున్నట్టు వెల్లడించారు. ఆశ్చర్యకరమైన విశే షమేమిటంటే గతంలో ఇలాంటి విజయం తర్వాత మెన్స్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్‌కు ఈ రేంజ్‌లో ఫాలోవర్స్ పెరగలేదు. అలాగే బ్రాండ్ వాల్యూ కూడా ఒక్క టోర్నమెంట్‌తో పెరగలేదు. మహిళల జట్టు మాత్రం ఒక్క విజయంతోనే తమ బ్రాండ్ వాల్యూను రెట్టింపు చేసుకోవడం వారి క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.