calender_icon.png 29 August, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు శిఖంలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్

29-08-2025 12:46:07 AM

  1. రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు 
  2. ఇప్పటికే పలు ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొనుగోలుదారులకు 
  3. అనుమతులు కష్టమే? 

మేడ్చల్, ఆగస్టు 28 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో తుమ్మ (ఎర్ర) చెరువు శిఖంలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు బ్రేక్ పడింది. శిఖంలోని ప్లాట్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయవద్దని అదనపు కలెక్టర్ సబ్ రిజిస్టర్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఇప్పటికే కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మేడ్చల్ పట్టణ నడిబొడ్డున తుమ్మ చెరువు ఉంది. దీని చుట్టూ కాలనీలు ఉన్నాయి.

శిఖంలో గ్రామ పంచాయతీ హయాంలో వెంచర్ వేశారు. ఎఫ్ టి ఎల్ పరిధిలోకి వచ్చే ప్లాట్లను అప్పట్లో వెంచర్ యజమానులు విక్రయించలేదు. నాలుగేళ్ల క్రితం నలుగురు రాజకీయ నాయకులు మిగిలిన అన్ని ప్లాట్లను వెంచర్ నిర్వాహకుల వద్ద రూ. 25 లక్షలకు కొనుగోలు చేశారు. వాటిని ఇటీవల విక్రయించడంతో  రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

లొసుగుల ఆధారంగా.....

శిఖంలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసే విషయంలో నలుగురు రాజకీయ నాయకులతో రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులు కుమ్మ క్కు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలోని లొసుగులను ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గ్రామపంచాయతీ హాయంలో వేసిన వెంచర్లకు ఎల్‌ఆర్‌ఎస్ కింద డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది.

ఇక్కడే పెద్ద తిరకాసు ఉంది. నలుగురు రాజకీయ నాయకులు ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఎల్‌ఆర్‌ఎస్ కింద మున్సిపాలిటీకి సుమారు లక్ష 30 వేల రూపాయలు చెల్లించారు. ఈ రసీదు ఆధారంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాస్తవానికి మున్సిపాలిటీ వీటికి ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు.

ప్రొసీడింగ్స్ ఇస్తేనే లీగల్. తర్వాత ఎల్‌ఆర్‌ఎస్ కింద చెల్లించిన డబ్బులు లక్ష 17 వేల రూపాయలు మున్సిపల్ అధికారులు వాపసు చేశారు. అంటే ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్ అయ్యాయి. రాజకీయ నాయకులు మున్సిపల్ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు అవగాహనతోనే ఇలా చేశారని తెలుస్తోంది. 

అయోమయంలో కొనుగోలుదారులు 

ఈ ప్రాంతంలో గజానికి 40 నుంచి 50 వేల రూపాయల ధర పలుకుతుండగా, రాజకీయ నాయకులు శిఖంలోని ప్లాట్లను గజానికి 25 వేల రూపాయల చొప్పున విక్రయించారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఉద్దేశంతో 28 మంది కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ లలో భవన నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశం లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. గతంలో జి ప్లస్ రెండు అంతస్తులకు అనుమతినిచ్చారు. ఈ వెంచర్ లో స్మశాన వాటిక ఉంది.

అది కూడా రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. కాగా, తుమ్మ చెరువు శిఖంలో అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని బిజెపి నాయకుడు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎల్ ఆర్ ఎస్ చెల్లించినట్లు డ్రామా చేసి రిజిస్ట్రేషన్లు చేశారని, ఇందులో బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.