calender_icon.png 29 August, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 కోట్లతో సీఎంపీ ప్యాడ్ హబ్

29-08-2025 12:43:04 AM

భారత్‌లో తొలిసారి ఏర్పాటు

  1. సెమీకండక్టర్ పరిజ్ఞానానికి గేట్‌వేగా తెలంగాణ
  2. జపాన్‌కు చెందిన టోహూ కోకి సెయిసాకుషో, టీ ఎంవోయూ
  3. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హర్షం

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): జపనీస్ సెమీకండక్టర్ సాంకేతిక పరిజ్ఞానానికి ముఖద్వారంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. సెమీకండక్టర్లు తయారీలో కీలకమైన కెమికల్, మెకానికల్ పాలిషింగ్ టెక్నాలజీని స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చేం దుకు జపాన్‌కు చెందిన టోహూ కోకి సెయిసాకుషో సంస్థ ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

భారత్‌లో తొలిసారి సీఎంపీ ప్యాడ్ హబ్‌ను రూ.8 కోట్ల వ్యయంతో ఆ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు టోహూకోకి సెయిసాకుషో, టీవర్క్స్ మధ్య అవగా హన ఒప్పందం కుదరింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఫొటో టైపింగ్ కేంద్రం టీ జపనీస్ సంస్థ భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలకు ఈ ప్యాడ్ హబ్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. సీఎంపీ సేవలు అవసరమైన పరిశ్రమలు ఈ సదుపాయాన్ని వినియోగిం చుకోవచ్చని, సెమీకండక్టర్ పరిశ్రమకు విడి భాగాలు అందించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తెలంగాణ ప్రతిష్టను పెంచాలని కోరారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

జపనీస్ పరిశ్రమలు, అంకుర సంస్థలు, పరిశోధకుల కోసం టీ-వర్క్స్‌లో ప్రత్యేకంగా ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ శిక్షణ పొందిన వారు స్థానికంగా సీఎంపీ ప్యాడ్‌లను సొంతంగా తయారు చేయగలిగే పరిజ్ఞానం పొందగలుగుతారని వివరించారు. దీని కోసం తొలుత ఒకటి లేదా రెండు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఎంపిక చేసే శిక్షణ అందిస్తామని వెల్లడించారు.

ఈ రంగంలో 200-300 మంది సాంకేతిక నిపుణులను తయారు చేయడం తమ లక్ష్యమని అన్నారు. దేశం సీఎంపీ ప్యాడ్‌ల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం పాటు పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సీఎంపీ ప్యాడ్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేకపోవడం వల్ల ఏటా రూ. 100 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. అవగాహన ఒప్పంద కార్యక్రమంలో టోహూ కోకి సంస్థ గ్లోబల్ బిజినెస్ హెడ్ టకుయా నిషిమురా, టీధావర్క్స్ సీఈవో జోగీందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.