06-12-2025 12:29:01 AM
పోటాపోటీగా ప్రచారం
మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రె స్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ఇద్దరు అన్నదమ్ములను బలపరచడంతో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ పులి వెంకన్న అనే అభ్యర్థిని బరిలో నిలిపింది. అతడి సోదరుడు పులి రామచంద్రును బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చి బరిలో నిలిపింది.
ఇద్దరు అన్నదమ్ములు బరిలో నిలవడం ఆసక్తిగా మారింది. ఇద్దరు కూడా ప్రచారం పోటాపోటీగా చేస్తూ, గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెంకన్న గతంలో ఒకసారి ఎంపీటీసీ, ఇంకోసారి సర్పంచ్‌గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో తనకు సానుభూతి కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నాడు. రామచంద్రు కూడా సుపరిచితుడు కావడంతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందు ఉండటంతో తన గెలుపు తథ్యమని ధీమాతో ఉన్నాడు.