26-01-2026 02:19:58 AM
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి) : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఆ ఛానెల్ ప్రతినిధి వెంకట కృష్ణ వ్యవహరించిన తీరును ఖండించారు.
ఏబీఎన్ ప్రతినిధి వ్యాఖ్యలు కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. ఉద్యమకారుడికి అవమానం జరిగిందని పార్టీ అధిష్టానం భావించిందని తెలిపారు. దీంతో ‘బాయ్‌కాట్ ఏబీఎన్’లో భాగంగా పార్టీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఏబీఎన్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. డిబేట్‌కు పిలిచిన అతిథి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉన్నదని, తదనంతర కాలంలో కూడా అనేకసార్లు బీఆర్‌ఎస్ నాయకుల మీద అసత్య కథనాలు ప్రచురించడం/ప్రసారం చేయడం, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం ఆంధ్రజ్యోతి గ్రూప్ పదే పదే చేస్తున్నదని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ పట్ల, తెలంగాణ పట్ల ఆంధ్రజ్యోతి వైఖరి మారకపోవడం వల్ల ఇకపై బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ ఏబీఎన్ ఛానెల్‌లో జరిగే చర్చల్లో పాల్గొనరాదని, పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే పార్టీ సమావేశాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని పార్టీ నిర్ణయించినట్టు స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో వెంకటకృష్ణ చిత్ర పటం దహనం
ఎమ్మెల్సీ రవీందర్‌రావుపై ఏబీఎన్ వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్వీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పనిచేస్తున్న మీడియాను తరిమికొడతామని బీఆర్‌ఎస్వీ నాయకుడు నాగేందర్‌రావు హెచ్చరించారు. రవీందర్‌రావుతో జర్నలిస్టు వెంకట కృష్ణ వ్యవహరించిన తీరు సరిగా లేదని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణ నడవనీయబోమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులు, వెంకట కృష్ణ చిత్రపటాన్ని చింపివేసి దహనం చేశారు.