calender_icon.png 26 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరిసిన 131 పద్మాలు

26-01-2026 02:13:34 AM

  1. ఐదుగురికి పద్మ విభూషణ్ 
  2.   13 మందికి పద్మ భూషణ్
  3.   113 మందికి పద్మశ్రీలు 
  4. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు
  5. మరణానంతరం పొందిన వారు 16 మంది 

న్యూఢిల్లీ, జనవరి 25: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహూకరించనుంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, మరణాంతరం పొందిన వారు 16 మంది, విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐ, పీఐఓ, ఓసీఐ విభాగాల్లో ఆరుగురు ఉన్నారు.

తెలంగాణలో ఏడుగురికి, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి పద్మశ్రీలు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి అవార్డులు వచ్చాయి. అన్నివిభాగాల నుంచి మహారాష్ట్రకు మొత్తం 15, తమిళనాడుకు 13, పశ్చిమ బెంగాల్‌కు 11, ఉత్తరప్రదేశ్‌కు 11,  కేరళకు 8, కర్ణాటకకు 8, తెలంగాణకు 7, అంధ్రప్రదేశ్‌కు 4, గుజరాత్‌కు 5, అస్సోం కు 5, మధ్యప్రదేశ్‌కు 4, ఢిల్లీకి 4, ఒడిశాకు 4, రాజస్థాన్‌కు 3, పంజాబ్‌కు 3, బీహార్‌కు 3, అవార్డులు దక్కాయి.

ఎన్నికల కోణం

కేంద్రం విడదల చేసిన పద్మపురస్కారాల జాబితాలో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఎందుకంటే అన్నివిభాగాల నుంచి మహారాష్ట్రకు మొత్తం 15 పద్మ అవార్డులు దక్కాయి. ఆ తర్వాత తమిళనాడుకు 13, పశ్చిమ బెంగాల్‌కు 11, తెలంగాణకు 7 అవార్డులు వచ్చాయి. వీటి లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు అతిసమీపంలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకే ఆయా రాష్ట్రాలకు ఎక్కువ పద్మ పురస్కారాలు వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి పద్మశ్రీలు

తెలంగాణ నుంచి చంద్రమౌళి గద్దమనుగు(సైన్స్ అండ్ ఇంజనీ రింగ్), దీపికారెడ్డి (ఆర్ట్స్), గూడూరు వెంకట్‌రావు(మెడిసన్), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్(సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కుమారస్వామి తంగరాజ్((సైన్స్ అండ్ ఇంజనీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్‌రెడ్డి(మెడిసన్), రామారెడ్డి మామిడి(పాడి, యానిమల్ హస్బెండరీ)కి పద్మశ్రీలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి నటుడు, నటకిరీటి గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(ఆర్ట్స్), నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్, వెంపటి కుటుంబ శాస్త్రి(రచయిత, ఎడ్యుకేషన్) పద్మశ్రీలు వరించాయి.

 తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి, హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు. జంతు పోషణ, గ్రామీణ జీవనోపాధి మెరుగుపరచడంలో రామారెడ్డి చేసిన విశేష కృషికి ఈ పురస్కారం దక్కింది. అదేవిధంగా, జన్యు పరిశోధన రంగంలో డాక్టర్ తంగరాజ్ అందించిన సేవలకు గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. 

పద్మ విభూషణ్ గ్రహీతలు వీరే

1. ధర్మేంద్రసింగ్ డియోల్(మరణాంతరం) (ఆర్ట్ విభాగం), మహారాష్ట్ర. ఈయన బాలీవుడ్‌కు విశేష సేవలందించారు.

2. కేటీథామస్(పబ్లిక్ అఫైర్స్ విభాగం), కేరళ

3. ఎంఎస్ ఎన్ రాజం (ఆర్ట్ విభాగం), ఉత్తరప్రదేశ్

4. పీ నారాయణన్ (లిటరేచర్, ఎడ్యుకేషన్), కేరళ

5. వీఎస్ అచ్యుతానందన్ (పబ్లిక్ అఫైర్స్) కేరళ

పద్మ భూషణ్ గ్రహీతలు

1. అల్కా యాగ్నిక్, (ఆర్ట్) మహారాష్ట్ర

2. భగత్ సింగ్ కోష్యారి (ప్రజా వ్యవహారాలు) ఉత్తరాఖండ్

3. కల్లిపట్టి రామసామి పళనిస్వామి   (మెడిసిన్), తమిళనాడు

4. మమ్ముట్టి (కళ), కేరళ

5. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (వైద్య శాస్త్రం) అమెరికా సంయుక్త రాష్ట్రాలు

6. పియూష్ పాండే (మరణానంతరం), కళ, మహారాష్ట్ర

7. ఎస్.కె.ఎం. మైలానందన్, సోషల్ వర్క్, తమిళనాడు

8. శతావధాని ఆర్ గణేష్, కళ, కర్ణాటక

9. శిబు సోరెన్ (మరణానంతరం), ప్రజా వ్యవహారాలు, జార్ఖా

10.ఉదయ్ కోటక్, వాణిజ్యం మరియు పరిశ్రమ, మహారాష్ట్ర

11, వీకే.మల్హోత్రా (మరణానంతరం), ప్రజా వ్యవహారాలు, ఢిల్లీ

12. వెల్లపల్లి నటేశన్, ప్రజావ్యవహారాలు, కేరళ

13. విజయ్ అమృతరాజ్, క్రీడలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

సహకార రంగానికి రామరెడ్డి దన్ను

మామిడి రామరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ అభ్యుదయ రైతు, పాడి పరిశ్రమ నిపుణుడు. వ్యవసాయం, ముఖ్యంగా పశుసంవర్థక రంగంలో ఆయన చేసిన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రామరెడ్డి ప్రధానంగా పశుపోషణ, పాల ఉత్పత్తి రంగాల్లో తనదైన ముద్ర వేశారు. నాణ్యమైన పాల దిగుబడిని సాధించడానికి శాస్త్రీయ పద్ధతులను అవలంభించారు.

స్థానిక దేశవాళీ పశువుల జాతులను పరిరక్షించడం, వాటి ద్వారా అధిక దిగుబడిని సాధించడంలో ఆయన కృషి చేశారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు పాడి పరిశ్రమలోని మెలకువలు, పశుగ్రాసం పెంపకం వంటి అంశాలపై అవగాహన కల్పించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.

జన్యుశాస్త్ర మేధావి తంగరాజు

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ జన్యుశాస్త్రం, పరిణామం, మానవ జనాభా అధ్యయనంలో, ముఖ్యంగా జనాభా జన్యుశాస్త్రం, పురాతన డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ సైన్స్‌పై విస్తృత పరిశోధనలు చేశారు. తంగరాజ్ హైదరాబాద్‌లోని సీసీఎంబీలో శాస్త్రవేత్తగా ఉన్నారు. అలాగే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ)డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

పరిణామ జన్యుశాస్త్రం, జనాభా జన్యుశాస్త్రం, మానవ వ్యాధుల జన్యు మూలాలకు సంబంధించి తంగరాజ్ విశేష పరిశోధనలు చేశారు. భారతదేశంలోని విభిన్న జనాభా సమూహాల జన్యుపరమైన మూలాలను గుర్తించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ తంగరాజ్ జన్యుశాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొందారు.